ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి రిలీఫ్ ఫండ్ నుంచి ఏకంగా రూ. 117 కోట్లను కొట్టేయడానికి వేసిన ఓ ప్లాన్ బయటపడింది. సీఎంఆర్ఎఫ్ పేరుతో.. అసిస్టెంట్ సెక్రటరీ టు గవర్నమెంట్, రెవిన్యూ శాఖ ఇచ్చినట్లుగా చెబుతున్న మూడు చెక్కులు.. ఢిల్లీ, కోల్కతా, బెంగళూరు ఎస్బీఐ బ్రాంచీల్లో జమ అయ్యాయి. మూడు కలిపి రూ. 117 కోట్లు సొమ్ము తమ ఖాతాలకు మళ్లించుకోవాలనుకున్నారు. అది పెద్ద మొత్తం కావడంతో ఆయా బ్రాంచ్ల అధికారులు.. ఇక్కడ వెలగపూడి బ్రాంచ్ అధికారులను సంప్రదించారు. వారు… చెక్కులు జారీ చేసిన అసిస్టెంట్ సెక్రటరీ టు గవర్నమెంట్, రెవిన్యూ శాఖను అడిగారు. అయితే.. తాము చెక్కులు జారీ చేయలేదని చెప్పడంతో అక్కడితో మోసం ఆగిపోయింది. ఖజానాకు రూ. 117 కోట్లు లాస్ కాకుండా ఆగింది.
అయితే.. ఆ చెక్కులు పరిశీలిస్తే అత్యంత పకడ్బందీగా ఉన్నాయి. ఎవరికీ అనుమానం వచ్చే పరిస్థితి లేదు. అసలు చెక్కులు.. ఎలా ఇతరులకు వెళ్తాయన్నది పెద్ద సందేహం. ఇంత పెద్ద మొత్తంలో అమౌంట్ వేసుకుని డ్రా చేసుకోవడానికి సిద్ధపడ్డారంటే.. గతంలో ఖచ్చితంగా ఇలాంటి చెక్కులను పాస్ చేసుకుని ఉంటారన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. సీఎంఆర్ఎఫ్ నిధులపై పెద్దగా ఆడిటింగ్ ఉండదు. సీఎం విచక్షణమేరకు ఇచ్చే నిధి అది. ఇటీవలి కాలంలో చాలా మంది పారిశ్రామికవేత్తలు.. కరోనా విపత్తు నేపధ్యంలో సీఎంఆర్ఎఫ్కు కోట్లకు కోట్లు విరాళాలిచ్చారు. దాంతో ఆ ఖాతాలో దండిగా నిధులు ఉంటాయని అంచనా వేసిన ముఠా .. ఈ చెక్కుల ద్వారా.. వాటిని కొట్టేస్ ప్రయత్నం చేసింది.
ఈ వ్యవహారంపై మొత్తం అవగాహన ఉన్నవారే.. చెక్కులతో రూ. 117 కోట్లు కొట్టేయడానికి ప్రయత్నించారని అర్థమవుతుంది. ఆ నిందితులెవరో పట్టుకోవడం పెద్ద విషయం కాదు. అది క్రాస్డ్ చెక్. ఎవరి ఖాతాలో ఆ సొమ్ము వేయాలనుకున్నారో తీగ లాగితే మొత్తం బయటకు వస్తుంది. అయితే మోసం వెలుగు చూసింది కానీ.. ఆ దిశగా దర్యాప్తు ప్రారంభించలేదు. ఓ సారి సీఎంఆర్ఎఫ్ లెక్కలు సరి చూస్తే.. ఎన్ని సార్లు ఆ ముఠా ఇలా చెక్కులు జారీ చేసి నొక్కేసిందో.. ఎంత నొక్కేసిన తర్వాత బయటపడిందో తేలే అవకాశం ఉంది. పూర్తిస్థాయిలో విచారిస్తే ఈ ఘరానా మోసం గుట్టు వీడుతుంది.