వైసిపి ఎంపీ టిడిపి చేరడం ఖాయమైపోవడం తో ఇప్పుడు డిస్కషన్ అంతా ఎందుకని ఆమె మారుతోందనే టాపిక్ వైపు మరలింది. రెండు పార్టీలూ రెండు విభిన్న వాదనలు వినిపిస్తున్నాయి. అలాగే రెండు పార్టీలకి వత్తాసు పలికే మీడియా ఛానెళ్ళు, ఆయా పార్టీలని అభిమానించే వెబ్ సైట్లు కూడా ఆయా పార్టీల రాగాన్నే అందుకున్నాయి. కానీ ఒకసారి నిష్పాక్షికంగా విశ్లేషిస్తే రెండు పార్టీలకీ పనికొచ్చే చాలా “కంక్లూజన్స్” ఇందులో ఉన్నాయి.
మొదటిది – టిడిపి వాదన చూద్దాం. ఏ అధికార పార్టీ అయినా చెప్పే ఏకైక కారణం – తమ అభివృద్ది చూసి పార్టీ ఫిరాయిస్తున్నారు అని. అయితే టిడిపి ఒకడుగు ముందుకేసి, జగన్ వ్యవహారశైలి నచ్చకే టిడిపి లో చేరుతున్నారు అని ప్రచారం చేస్తోంది. టిడిపి, టిడిపి అనుకూలుర వాదన ఇలా ఉంది – జగన్ రేణుక కి ఎంపీ సీట్ కన్ ఫర్మ్ చేయకుండా దానిబదులు ఎమ్మిగనూర్ నుంచి ఎమ్మెల్యే గా పోటీ చేయమనడం తో ఆమె పార్టీ మారింది అని. జగన్, మనం అధికారం లోకి వచ్చాక రాష్ట్ర మంత్రి పదవి ఇస్తానని అంటే, దానికి ఆవిడ మనం గెలుస్తామని గ్యారంటీ ఏంటి అని అడిగినట్టు, దీనితో జగన్ఇరిటేట్ అయినట్టు, ఆమె పార్టీ మారినట్టు చెప్తున్నారు. అలాగే ఎమ్మిగనూర్ టిడిపి కంచుకోట కావడం వల్లే ఆమె ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెబుతున్నారు.
రెండవది – వైసిపి వాదన ఇలా ఉంది. దాదాపు 100 కోట్ల ప్యాకేజీ కి బుట్టా లొంగిపోయారనీ, కేవలం డబ్బు కోసమే మారుతున్నారని, ఇది నమ్మక ద్రోహమే అని వారు అంటున్నారు. సామాన్య మహిళ అయిన ఆమెని జగన్ ఎంపీ చేస్తే ఆమె నమ్మకద్రోహం చేసారని వారంటున్నారు. జగన్ బిసిలకే కర్నూల్ ఎంపీ ఇస్తామని అనుకున్నారనీ, అక్కడ బిసి గా ఉన్నది ఆవిడేనని, కాబట్టి డబ్బు తప్ప మరేదీ కారణం కాదని వారంటున్నారు.
అయితే ఈ రెండు వాదనల్లోనూ లొసుగులున్నాయి. మొదటిది టిడిపి వాదన. ఎమ్మిగనూర్ ఎమ్మెల్యే గా పోటీ చేయడం ఇష్టం లేదు అనేది. నిజానికి ఈ నియోజక వర్గం లో బుట్టా కి చాలా మంచి పేరు ఉంది. ఆమె సామాజిక వర్గమే ఇక్కడ బలంగా ఉంది. అదీ కాక ఇది టిడిపి కంచుకోట ఏమీ కాదు. 2004 -14 వరకు కాంగ్రెస్, వైసిపిలే ఇక్కడ పాగా వేసాయి. అలాగే వైసిపి వాళ్ళు చెబుతున్న 100 కోట్ల డీల్ కూడా హాస్యాస్పదమే. ఈవిడ కి , వీరి కుటుంబానికి ఉన్న వ్యాపారాలతో పోలిస్తే అది మరీ పెద్ద అమౌంటేమీ కాదు.
ఇక అసలు విషయానికి వస్తే, కర్నూల్ ఎంపీ స్థానానికి వైసిపిలో చాలా పోటీ ఉండింది 2014 కి ముందు.ఎందుకంటే అక్కడ జగన్ కి ఉన్న హవా రాజకీయవర్గాలకి తెలుసు. మరి అలాంటి స్థానానికి జగన్ పార్టీ కి ముందు నుంచి పనిచేసిన వారిని కాదని బుట్టా కి ఎందుకు టికెట్ ఇచ్చారు. ష్యూర్ షాట్ గెలిచే స్థానం అని తెలిసి కనీసం విజయమ్మ కి ఇవ్వకుండా కొత్తగా అప్పుడే వచ్చిన బుట్టా కి ఎందుకు ఇచ్చారు. విజయమ్మకి ఇచ్చి ఉంటే కనీసం ఆమె కి ఓటమి భారం తప్పేది. కానీ ఎందుకు బుట్టా కి ఇచ్చారంటే , ఖచ్చితంగా గెలిచే స్థానం కాబట్టి ఎవరు ఎక్కువ ఫండ్ ఇస్తే వాళ్ళకి ఇచ్చారు. బుట్టా రేణుక వాళ్ళు అప్పట్లోనే “కోట్లు” పోసి ఆ సీటు తెచ్చుకున్నారని ఒక రూమర్ ఉంది. ఒకవేళ అంతంత అమౌంట్ పెట్టి ఉంటే ఖచ్చితంగా దాన్ని రిటర్న్ తెచ్చుకునే మార్గాలు ఆలోచిస్తారు కదా. కాబట్టి సామాన్య మహిళ ని జగన్ ఎంపీ గా చేసాడనే వాదన కూడా తప్పే కదా. మరి ఆమె ఫండ్ ఇచ్చి ఉంటే, అదే ఆమె కన్సర్న్ అయి ఉంటే దీని గురించి అందరి కన్నా బాగా తెలిసిన వ్యక్తి జగనే, దాన్ని అడ్రస్ చేసి ఉండాల్సింది కూడా జగనే.
ఇక టిడిపి విషయానికి వద్దాం. ఇప్పుడు బుట్టా ని చేర్చుకోవడం వల్ల టిడిపికి వచ్చే ప్రయోజనం ఏంటి?. ఫక్తు రాజకీయ నాయకురాలు కాకపోవడం వల్ల ఆమెకి పెద్ద క్యాడర్ కూడా లేదు. జగన్ ఆత్మ స్థైర్యం దెబ్బతీసాం అనే మానసికానందం తప్ప టిడిపి కి అదనపు ప్రయోజనం ఏమీ లేదు, 2019 లో సీట్ల పంపకం అప్పుడు పితలాటకం తప్ప. ఏదో విధంగా జగన్ దెబ్బ తీయాలనే ఉద్దేశ్యం తప్ప వేరే ఏమీ కనిపించడం లేదు ఇక్కడ. పోనీ జగన్ కి అయినా దెబ్బ తగులుతుందా అంటే అదీ డౌటే. ఒక లీడర్ కాకపోతే మరొకరు రెడీగా ఉంటారు. ప్రజల విశ్వాసం చూరగొనే పనులు మానేసి, ఇలాంటి రాజకీయాలు చేయడం వల్ల ఉపయోగం శూన్యం.
అసలు ఫిరాయింపులే అనైతికం. రాజ్యాంగం లో పదో షెడ్యూల్ పూర్తిగా ఫిరాయింపులు నిరోధించడానికే ఏర్పాటైనా కానీ ఇవి ఆగట్లేదంటే అందులోని లొసుగులే కారణం. “రెప్రెజంటేటివ్స్ ఆఫ్ పీప్లు యాక్ట్” ని ధిక్కరిస్తే మాత్రమే ఎలక్షన్ కమీషన్, కోర్ట్ చర్యలు తీసుకోగలుగుతాయి – కులాన్ని రెచ్చగొట్టడం, మతాన్ని రెచ్చగొట్టడం లాంటి నేరాలు దీని కిందకి వస్తాయి. కొన్ని సందర్భాలలో నేరుగా రాష్ట్రపతి చర్యలు తీసుకునే అవకాశాలు ఉన్నాయి. ఉదాహరణకి “ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్” లాంటివి నిర్వహించడం, వేరే దేశ పౌరసత్వాన్ని స్వీకరించడం లాంటివి దీనికిందకి వస్తాయి. కానీ ఫిరాయింపులకి సంబంధించిన చర్యలు మాత్రం స్పీకర్ పరిధి లోనే ఉంటాయి. దాదాపు అన్ని సార్లూ ఈ స్పీకర్ అధికార పక్షాని చెందిన వ్యక్తే. అదే సమస్య కి మూల కారణం.
ఎప్పుడో రాజీవ్ గాంధీ టైం లో రూపొందించిన రాజ్యాంగం లోని పదోషెడ్యూల్ ని సవరించాల్సిన సందర్భం, అవసరం దగ్గరకి వచ్చిందేమోననిపిస్తోంది. స్పీకర్ నుంచి పూర్తిగా ఈ అధికారాన్ని లాగనవసరం లేదు కానీ, స్పీకర్ “ఇన్ని నెలల్లోగా లేదంటే ఇన్ని రోజుల్లోగా” ఈ అంశం మీద చర్య తీసుకుని తీరాలన్న “టైం బౌండ్” ని రాజ్యాంగం లోకి చేరిస్తే చాలు, ఈ సమస్య ని పరిష్కరించినట్టే.