పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ వెర్సెస్ కేంద్ర ప్రభుత్వం అన్నట్టుగా తాజా పరిస్థితులున్నాయి. శారదా చిట్స్ కుంభకోణం వివాదంలో భాగంగా కోల్ కతా పోలీస్ కమీషనర్ ను విచారించేందుకు సీబీఐ ప్రయత్నించడం, సీబీఐ అధికారులను పోలీసులు అదుపులోకి తీసుకోవడం, ఆ తరువాత మమతా ధర్నాకి దిగడం… ఇప్పుడు దేశవ్యాప్తంగా ఇదే చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో బెంగాల్ లోని శాంతి భద్రతల పరిస్థితి గురించి ఆ రాష్ట్ర గవర్నర్ కేసరీనాథ్ త్రిపాఠీని కేంద్ర హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్ నివేదిక కోరారు. సోమవారం సాయంత్రానికే ఆ నివేదికను కేంద్రానికి పంపినట్టుగా రాజ్ భవన్ వర్గాలు చెబుతున్నాయి.
పార్లమెంట్ సమావేశంలో రాజ్ నాథ్ మాట్లాడుతూ… సుప్రీం కోర్టు ఆదేశాల మేరకే శారదా కుంభకోణం మీద విచారణ జరుగుతోందన్నారు. బెంగాల్ కమిషనర్ కి గతంలో చాలాసార్లు నోటీసులు పంపించామనీ, కానీ ఆయన విచారణకు సహకరించలేదన్నారు. ఈ కేసుపై నిష్పాక్షికంగా విచారణ జరగాలంటే పశ్చిమ బెంగాల్ రాష్ట్ర ప్రభుత్వం సహకరించాల్సి ఉంటుందన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య వివాదాలు ముదిరితే సమాఖ్య స్ఫూర్తికే విరుద్ధమని, అది మంచిది కాదని రాజ్ నాథ్ వ్యాఖ్యానించారు. మమతా ప్రభుత్వం రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా వ్యవహరిస్తోందని ఆయన విమర్శించారు.
బెంగాల్ లో నిజంగానే శాంతి భద్రతల సమస్య ఉందా, లేదంటే కావాలనే సృష్టించే ప్రయత్నం జరుగుతోందా అనే అనుమానాలు కలుగుతున్నాయి. సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో… రాష్ట్రాన్ని తమ అధీనంలోకి తీసుకుని, ఎలక్షన్స్ నిర్వహించాలనే వ్యూహంతో భాజపా ఉందా అనే అభిప్రాయాలూ వ్యక్తమౌతున్నాయి. భాజపా వ్యతిరేక పక్షాలన్నీ కోల్ కతా వేదికగా ఒకటైన సంగతి తెలిసిందే. విపక్షాలు ఇటీవల నిర్వహించిన ర్యాలీ పెద్ద విజయం సాధించింది. మోడీ సర్కారుపై వ్యతిరేకత బెంగాల్ లో తీవ్రంగా వ్యక్తమౌతోంది. తాజాగా ప్రధాని మోడీ సభ తరువాత రాష్ట్రంలో వ్యక్తమైన నిరసనలు కూడా అందుకు సాక్ష్యమే. దీంతో, ఆ రాష్ట్రాన్ని రాష్ట్రపతి పాలన కిందకు తీసుకొస్తే.. ఎన్నికల నిర్వహణలో పరోక్షంగా వారికి చాలా ఉపకరించే అవకాశం ఉందనేది కొంతమంది అభిప్రాయం. కేంద్రం అనుసరిస్తున్న వైఖరి చూస్తుంటే… ఆ దిశగానే సాగుతోందనేది విశ్లేషకుల అభిప్రాయం. రాజ్యాంగ విరుద్ధంగా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తోందని రాజ్ నాథ్ వ్యాఖ్యలు చూస్తే… భాజపా వ్యూహమేంటో అర్థం చేసుకోవచ్చు!