ఆంధ్రప్రదేశ్ రాజ్యాంగ సంక్షోభం దిశగా వెళ్తున్న సూచనలు కనిపిస్తున్నాయి. ఎస్ఈసీ ఆదేశాలను పాటించడానికి చీఫ్ సెక్రటరీతో పాటు.. డీజీపీ కూడా.. సిద్ధంగా లేనట్లుగా తెలుస్తోంది. ఆదివారం ఉదయం స్టేట్ ఎలక్షన్ కమిషనర్ రమేష్ కుమార్ రెండు జిల్లా ఎస్పీలు, కలెక్టర్లతో పాటు మాచర్ల సీఐ.. మరికొంత మంది పోలీసుల అధికారులపై చర్యలకు సిఫార్సు చేశారు. ఆ ఆదేశాలు అమలు చేయాల్సింది చీఫ్ సెక్రటరీ, డీజీపీలు, సాధారణంగా.. ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైన తర్వాత… ఎలక్షన్ కమిషన్ నుంచి ఎలాంటి ఆదేశాలు వచ్చినా.. పాటించాల్సి ఉంటుంది. కానీ.. ఇప్పటి వరకూ.. ఎస్ఈసీ ఆదేశాలను పాటించలేదు.
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎస్ఈసీకి అధికారులను బదిలీ చేసే అధికారాలు లేవని వాదిస్తూండటంతో… ఉన్నతాధికారులు టెన్షన్లో ఉన్నారు. ఆయన లెక్క ప్రకారం.. బదిలీలు చేయడానికి వీల్లేదు. కానీ ఎస్ఈసీ సిఫార్సులు చేసింది. ఎస్ఈసీ ఆదేశాలను పాటిస్తే.. ముఖ్యమంత్రికి కోపం వస్తుంది. ఎల్వీ సుబ్రహ్మణ్యాన్ని తరిమిసేసినట్లుగా.. సీఎస్‌ను తరిమేస్తారు. అలాగే.. డీజీపీ పరిస్థితి కూడా ఉంటుంది. అందులో సందేహమే లేదు. అందుకే.. వారు.. ముఖ్యమంత్రి అభీష్టానికి వ్యతిరేకంగా ఉత్తర్వులు ఇవ్వడానికి సిద్ధంగా లేరు. అదే సమయంలో… ఎస్ఈసీ ఆదేశాలను ఉల్లంఘిస్తే… పరిస్థితి రాజ్యాంగ సంక్షోభానికి దారి తీస్తుంది. ఇది పెద్ద వివాదం అయిపోతుంది.
ఎస్ఈసీ తమను ఎన్నికలు నిర్వహించడనీయడం లేదని.. తమ ఆదేశాలను పాటించడం లేదని… హైకోర్టుకు వెళ్తే… పరిస్థితి మరింత ముదిరిపోతుంది. రాజ్యాంగంలో స్పష్టమైన అధికారాలు ఉన్నా.. స్వతంత్ర సంస్థ అయిన ఎన్నికల సంఘం విషయంలో.. ప్రభుత్వం ఇలా చేయడం… రాజ్యాంగ నిపుణుల్ని సైతం విస్మయ పరుస్తోంది. రాజ్యాంగ ఉల్లంఘనకు నేరుగా పాల్పడుతున్న ఆధారాలను ప్రభుత్వమే సృష్టిస్తోందని.. కేంద్ర ప్రభుత్వం తీవ్ర చర్యలు తీసుకోవడానికి కూడా కావాల్సిన పరిస్థితులను ప్రభుత్వమే కల్పిస్తోందన్న అభిప్రాయం మాత్రం రాజ్యాంగ నిపుణుల్లో ఏర్పడుతోంది. ఈ పరిస్థితి అధికారులకు కత్తిమీద సాములా మారింది. రాజ్యాంగ విరుద్ధమైనా సీఎంకు వ్యతిరేకంగా వెళ్లలేని పరిస్థితి.. అలాగని.. ఎస్ఈసీ ఆదేశాలను పాటించకపోతే.. ఏమవుతుందోనన్న ఆందోళన వారిని వెంటాడుతోంది.