ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, సివిల్ సర్వీస్ అధికారుల భవనాల నిర్మాణాలను నాగార్జన కన్స్ట్రక్షన్స్ కంపెనీ మళ్లీ ప్రారంభించింది. మూడేళ్ల కిందట ఆ భవనాలు దాదాపుగా 70 శాతం వరకూ పూర్తయ్యాయి. జగన్ సీఎం అయిన తర్వాత ఆగిపోయాయి. అప్పట్నుంచి రాజధానిని నిర్వీర్యం చేసే ప్రయత్నాలు జరిగాయి. చివరికి రైతులు న్యాయపోరాటం చేసి విజయం సాధించడంతో ప్రభుత్వం అయిష్టంగానే అయినా నిర్మాణాలు పునం ప్రారంభించాలని నిర్ణయించుకుంది. ఈ మేరకు ఎన్సీసీ కంపెనీకి ఉన్న బిల్లు బకాయిలు స్వల్పంగా చెల్లించి.. నిర్మాణాలు కొనసాగించాలని.. చెల్లిస్తామని హామీ ఇచ్చారు.
కొన్ని బ్యాంకులు ఈ ప్రాజెక్టుకు రుణాలివ్వడంతో ప్రాజెక్టులు ముందుకు సాగాయి. అప్పట్లోనే ఈ భవనాలను ఆపేయకుండా నిర్మాణాలు కొనసాగించి ఉంటే చాలా తక్కువ ఖర్చుతో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పాటు ఉన్నతాధికారులందరికీ వసతి లభించేది. కానీ ప్రభుత్వం అందరికీ మూడేళ్ల పాటు అద్దెలు చెల్లిస్తూ ప్రైవేటు భవనాల్లోనే వారిని ఉంచుతోంది. హైకోర్టు తీర్పు తర్వాత ముందుగా కీలక భవనాల నిర్మాణం ప్రారంభం కావడంతో రైతులు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఎన్సీసీ కంపెనీ మళ్లీ నిర్మాణాలు ప్రారంభించడానికి ఒక్క రోజు ముందే రైతులు హైకోర్టులో అఫిడవిట్ దాఖలు చేశారు. ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా కోర్టు తీర్పును ఉల్లంఘిస్తోందని పనులు చేయడం లేదని .. కోర్టు ధిక్కార చర్యలు తీసుకోవాలని కోరారు. ఒక్క రోజునే నిర్మాణాలు ప్రారంభమయ్యాయి.