తెలంగాణ సచివాలయంలో రోజుకో చోట పెచ్చులు ఊడి పడుతున్నాయి. అది స్ట్రక్చర్ నిర్మాణ లోపం కాదని పైపై మెరుగులపనేనని నిర్మాణ సంస్థతో ఓ ప్రకటన ఇప్పించారు. అయితే రాజకీయానికి నిర్మాణ సంస్థతో పని ఉండదు. ఆ కాంట్రాక్ట్ ఇచ్చిన పార్టీతోనే సంబంధం ఉంటుంది. ఇప్పుడీ వ్యవహారం బీఆర్ఎస్ లను చుట్టుముడుతోంది. ఐదో అంతస్తు నుంచి పెచ్చులూడిపడి ఓ కారు ధ్వంసం అయింది. పొరపాటున అక్కడ మనిషి ఉండి ఉంటే.. ప్రాణాపాయం జరిగి ఉండేది.
అయితే ఆ ఒక్కటి కాదు వరుసగా పలు లోపాలు వెలుగులోకి వస్తున్నాయి. చాలా చోట్ల స్ట్రక్చర్ పగుళ్లు కనిపిస్తున్నాయి. కొన్ని చోట్ల నెర్రలు ఇచ్చి కనిపిస్తున్నాయి. ఈ ఫోటోలన్నీ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీంతో భారీగా కమిషన్ తీసుకుని కాంట్రాక్టులు ఇచ్చారని కాంగ్రెస్ నేతలు విమర్శలు చేస్తున్నారు. నిజానికి సచివాలయ నిర్మాణం అసలు అంచనాలు.. పెట్టిన ఖర్చుకు పొంతన లేదని ఆరోపణలు ఉన్నాయి. వాటిపై విచారణ చేయించాలన్న డిమాండ్ ఉంది.
ఇప్పుడు కొత్తగా నిర్మాణ లోపాలు కూడా వెలుగు చూస్తూండటంతో విచారణకు ఆదేశించే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు. అయితే ఇలాంటి విషయాల్లోనూ విచారణకు ఆదేశించడం కన్నా.. రాజకీయంతో సరి పెడితే సరిపోతుందన్న అభిప్రాయం కూడా ఉంది. మరి ప్రభుత్వం ఏం చేస్తుందో ?