తెలంగాణలోని కొత్త జిల్లాల్లో సకల మౌలిక సదుపాయాలు కల్పించాలంటూ కేసీఆర్ సర్కార్ ఒక విజన్ ను ప్రస్తావిస్తోంది. ఆలోచనలు చాలా ఘనంగా ఉన్నాయి. కానీ వాటి ప్రకారం పనులు చేయడానికే నిధుల జాడలేదు.
కొత్త జిల్లాలన్నింటిలో ఔటర్ రింగ్ రోడ్లు నిర్మించాలని కేసీఆర్ ఆదేశించారు. వాటిని నిర్మించడానికి నిధులు ఎక్కడి నుంచి వస్తాయో తెలియదు. అసలే కొత్త జిల్లాలకు కార్యాలయాల నిర్మాణం పెద్ద సవాలు. కలెక్టరేటుతో పాటు వివిధ శాఖల జిల్లా కార్యాలయాల నిర్మాణం ఖర్చుతో కూడుకున్నది. ఏకంగా 21 కొత్త జిల్లాల్లో వీటికి అయ్యే ఖర్చు వందల కొట్లలో ఉంటుందో, వేల కోట్లకు చేరుతుందో లెక్కలు వేస్తేనే తెలుస్తుంది.
కొత్త జిల్లా కేంద్రాలు త్వరలోనే నగరాలుగా మారుతాయన్నది కేసీఆర్ మాట. అవి కిక్కిరిసి పోకుండా ప్లాన్ ప్రకారం నిర్మాణాలు జరగాలని సూచించారు. మౌలిక సదుపాయాలు, ప్రభుత్వ కార్యాలయ సముదాయాలపైనా సూచనలు చేశారు. అంతా బాగానే ఉందిగానీ అసలు విషయం మాత్రం స్పష్టం కాలేదు. అదే, డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి.
ఇప్పటికే ప్రతిష్టాత్మక రైతు రుణ మాఫీకి నిధులు లేవు. ఒకేసారి మాఫీ చేసి ఉంటే రైతులకు నిజంగా ఊరట కలిగేది. విడతల వారీగా నిధులు ఇవ్వడం వల్ల రైతులకు మేలు కంటే కీడే ఎక్కువని ఇప్పటికే విమర్శలున్నాయి. మూడో విడత నిధుల విధులకూ ప్రభుత్వం మల్లగుల్లాలు పడాల్సిన పరిస్థితి.
ఆరోగ్యశ్రీ నిధుల చెల్లింపు కష్టంగా మారింది. బకాయిలు పేరుకుపోయాయి. విద్యార్థుల ఫీజు రీయింబర్స్ మెంటు బకాయిలనూ ఇంకా చెల్లించలేదు. కొన్ని శాఖల్లో సర్కారీ చెక్కులు బౌన్స్ అవుతున్నాయి, నిదులు ఏమవుతున్నాయని ఇప్పటికే కోదండరాం ప్రశ్నించారు. దీనికి జవాబు లేదు.
కొత్త జిల్లాల్లో ఆఫీసులు, ఔటర్ రింగ్ రోడ్ల నిర్మాణానికి నిదుల సమీకరణపై ప్రభుత్వం స్పష్టత ఇస్తేనే కలెక్టర్లు ఏం చేయడానికైనా అవకాశం ఉంటుంది. లేకపోతే నేల విడిచి సాము చేసినట్టు ఊరికే ప్రణాళికల గురించి చెప్పుకోవడం వల్ల ప్రయోజనం ఉండదు.