గుంటూరు , విజయవాడ నగరాలు దాదాపుగా కలిసిపోయాయి. రాష్ట్ర విభజన తర్వాత అమరావతి లో కంటే.. గుంటూరు, విజయవాడ మధ్య ఉన్న జాతీయ రహదారి పక్కన నిర్మాణాలు శరవేగంగా సాగాయి. బడా రియల్ ఎస్టేట్ కంపెనీలన్నీ తమ ప్రాజెక్టులు ప్రారంభించాయి. కానీ వాటికి 2019లో గ్రహణం పట్టేసింది. నిర్మాణాలు కొనసాగిస్తే కొంటారా లేదా అన్న విషయం కాదు.. ఏదో ఓ రూల్ పెట్టి కూల్చేస్తారన్న భయంతో ఆపేశారు. ఫలితంగా బడా కంపెనీలు కూడా నిర్మాణాలు ఆపేసి పరారయ్యాయి.
కొన్ని వేల కోట్ల సంపద అలా.. అక్కడ జంగిల్‌గా మారిపోయింది. ఇప్పుడు ప్రభుత్వం మారడంతో మళ్లీ కళ ప్రారంభమయింది. తమ ప్రాజెక్టుల్లో పెద్ద పెద్ద కంపెనీలు జంగిల్ క్లియరెన్స్ ప్రారంభించాయి. పిచ్చి మొక్కలు తొలగించి మళ్లీ ఆకర్షణీయంగా చేసుకుని నిర్మాణ కార్యక్రమాలు ప్రారంభించేందుకు సిద్ధమయ్యాయి. వచ్చే ఒకటి, రెండు నెలల్లో దాదాపుగా అన్ని భారీ ప్రాజెక్టులు మళ్లీ ఊపందుకునే అవకాశం ఉంది. నిర్మాణాలు ప్రారంభమైతే ఇక ఆ జోరు ఆపడం కష్టమే. విజయవాడ – గుంటూరు మధ్య హైవే.. కు రెండు వైపులా అతి పెద్ద వ్యాపార కేంద్రాలకు అవకాశం ఉంది.
గతంలో అనేక సంస్థలు తమ ప్రాజెక్టులను సిద్ధం చేసుకున్నాయి. కొన్ని వేల కోట్ల పెట్టుబడులు వచ్చే అవకాశాలు వచ్చి పడ్డాయి.. కానీ ఐదేళ్ల పాటు వారంతా సైలెంట్ అయిపోయారు. ఇప్పుడు అమరావతిలో ప్రభుత్వం జంగిల్ క్లియరెన్స్ నిర్వహిస్తోంది. అది పూర్తయిన వెంటనే నిర్మాణాలు పూర్తవుతాయి. ప్రభుత్వ పరంగా నిర్మాణాలు ప్రారంభిస్తే.. ప్రైవేటు ప్రాజెక్టులు కూడా ఊపందుకునే అవకాశం ఉంది.