సుప్రీంకోర్టు తీర్పంటే శిలాశాసనం. కానీ ధిక్కరించే వారికి అదికి కాయితం మాత్రమే. ప్రస్తుతం ఏపీలో అదే పరిస్థితి కనిపిస్తోంది. రుషికొండ తవ్వకాలు నిర్మాణాలుపై సుప్రీంకోర్టు స్పష్టమైన రూలింగ్ ఇచ్చింది. కొత్తగా తవ్వవొద్దని..గతంలో భవనాలు ఉన్న చోట మాత్రమే నిర్మాణాలు చేయాలని ఆదేశించింది. అయితే ఎక్కడో ఓ చోట నిర్మాణం చేయమన్నారనే దాన్ని అడ్వాంటేజ్‌గా తీసుకుని యథేచ్చగా నిర్మాణాలు కొనసాగిస్తున్నారు. కొండను తొలిచేసి కట్టాలనుకున్న చోటల్లా నిర్మాణాలు ప్రారంభించేశారు. ఎక్కడ మళ్లీ సుప్రీంకోర్టులో పిటిషన్ పడుతుందేమో అని.. వేగంగా వందల మంది కార్మికుల్ని పిలిపించి పనులు చేస్తున్నారు.
దీంతో మొదటి అందస్తు శ్లాబ్ వేయడానికి పనులు కూడా పూర్తయ్యాయి. ఓ వైపు ఈ అంశంపై హైకోర్టులో వాదనలు జరుగుతూనే ఉన్నాయి. మరో వైపు ప్రభుత్వం తాను చేయాలనుకున్నది చేస్తూనే ఉంది. సుప్రీంకోర్టు తీర్పును ఉల్లంఘించినట్లుగా తేలితే.. ముఖ్యమంత్రికి ఏం కాదు.. సంబంధింత మంత్రులకూ ఏం కాదు. కానీ న్యాయస్థానాలకు తప్పుడు సమాచారం ఇస్తున్న అధికారులే ఇరుక్కుపోతారు. ప్రభుత్వమే పట్టుదలగా చేయిస్తోంది కాబట్టి ఇప్పటికిప్పుడు.. బయటకు రాకపోవచ్చు కానీ.. సుప్రీంకోర్టు రాజ్యాంగబద్ధ సంస్థలతో విచారణచేయిస్తే మొత్తం బయట పడుతుంది.
ప్రభుత్వం మారి ఈ అక్రమాలను మొత్తం వెలుగులోకి తెస్తే.. చాలా మంది అధికారులు కోర్టు ధిక్కరణకు మాత్రమే కాదు.. దారుణమైన తప్పిదానికి పాల్పడినట్లుగా తేలుతుంది. అదే జరిగితే ఉద్యోగానికే ఎసరు రావడం కాదు.. కేసుల పాలవుతారు. అయినా ఏ నమ్మకంతో సుప్రీంకోర్టును సైతం ధిక్కరిస్తున్నారో వారికే తెలియాలి. గతానుభవాల నుంచి పాఠాలు నేర్చుకోకపోతే ఇలాంటి పరిస్థితులే ఏర్పడతాయన్న సెటైర్లు వినిపిపిస్తున్నాయి.