రియల్ ఎస్టేట్ మార్కెటింగ్ ఇప్పుడు బహుముఖంగా విస్తరించింది. స్థలాల పేరుతో మార్కెటింగ్ చేసే రీల్స్ సోషల్ మీడియాను ముంచెత్తుతున్నాయి. వీకెండ్ హోమ్స్ పేరుతో.. కంటెయినర్ ఇళ్లు కట్టిస్తామని.. కూడా ఆఫర్లు ఇస్తున్నారు. ఎంత దూరం వెళ్లినా ఇంకా చాలా దూరం వెళ్లాలన్నంత దూరంలో ఈ వెంచర్లు ఉంటాయి. వీటి కోసం ఆకర్షణీయంగా రీల్స్ చేసి మోటివెట్ చేస్తున్నారు.
చాలా స్వల్ప మొత్తమేనని.. పది నుంచి ఇరవై లక్షలు పెడితే.. మంచి స్థలంతో పాటు .. వీకెండ్ సరదాగా గడపడానికి ఏర్పాట్లు అని నమ్మిస్తారు. ఏర్పాట్లు కూడా ఉంటాయి. కానీ నిర్వహణ లేకపోతే అవి ఆరు నెలలకే పనికి రాకుండా పోతాయి. పిచ్చి మొక్కలతో నిండిపోతాయి. అలాంటి చోట్ల.. ప్లాట్లన్నీ అమ్ముడుపోయే వరకూ చక్కగా మెయిన్ టెయిన్ చేసి అంటగడుతున్నారు. ఇప్పుడిప్పుడే సంపాదన ప్రారంభిస్తున్న యువతను ఎక్కువగా మోటివేట్ చేస్తున్నారు. వారితో అప్పులు చేయించి ప్లాట్లు కొనిపిస్తున్నారు.
ఇలాంటి ప్లాట్లను కొనడమే కానీ అమ్మడం అనేది అసాధ్యంగా మారుతుంది. రీసేల్ అనేది ఉండదు. వచ్చే పది, ఇరవై ఏళ్ల తర్వాత అయినా ఇక్కడ కనీసం రోడ్డు మార్గం పడుతుందని.. ఏదైనా ఇళ్ల నిర్మాణం లేదా.. ఓ ప్రాజెక్టు, పరిశ్రమ వస్తుందని ఎవరూ అనుకోలేరు. రీల్స్ లో అత్యధిగంగా ఇలాంటి వాటినే ప్రమోట్ చేస్తారు. సోషల్ మీడియాలో చూసుకుని కొనడం అంటే..మోసపోయినట్లే. ప్లాట్లు చూసి అంచనా వేసుకునే కొనుగోలు చేయాలని రియల్ ఎస్టేట్ నిపుణులు సూచిస్తున్నారు.