సుప్రీంకోర్టు తీర్పును అమలు చేయడం లేదని.. సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీవీ వెంకటేశ్వరరావు కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు చేసేందుకు సిద్ధమవుతున్నట్లుగా తెలుస్తోంది. ఆయనపై సస్పెన్షన్ ఎత్తి వేసినట్లుగా ఉత్తర్వులు మాత్రం జారీ చేశారు కానీ జీతం కానీ.. పోస్టింగ్ కానీ ఇవ్వలేదు. ఫిబ్రవరి నుంచి ఆయన సస్పెన్షన్ ఎత్తివేస్తున్నట్లుగా ఉత్తర్వులిచ్చారు. అప్పటి నుంచి ఆయనకు పూర్తి స్థాయిలో జీతం ఇవ్వాల్సి ఉంది. కానీ చెల్లించడం లేదు. జీతమే ఇవ్వడం లేదు.. ఇక పోస్టింగ్ ఇస్తారని ఎవరూ అనుకోవడం లేదు. అలాగే ఇవ్వలేదు కూడా.
అయితే సుప్రీంకోర్టు తన తీర్పులో తక్షణం పోస్టింగ్ ఇవ్వాలని ఆదేశించింది. అయినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. వారాలకు వారాలు గడిచిపోతున్నాయి. తన బాధ్యతగా తన విషయాన్ని సీఎస్‌కు పదే పదే లేఖల ద్వారా తెలియచేస్తున్నారు ఏబీవీ. అయినా స్పందన లేదు. ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా తనను పక్కన పెడుతోందని.. తన హక్కులు హరిస్తోందని.. కోర్టు ధిక్కరణకు పాల్పడుతోందని ఆయన కోర్టుకు వెళ్లే యోచనలో ఉన్నారు. ఇప్పటికి మూడు సార్లు సీఎస్‌కు లేఖ రాశారు. ఓ సారి కలిసే ప్రయత్నం చేశారు. ఈ విషయాలన్నింటినీ రికార్డెడ్‌గా పెట్టుకున్న ఆయన కోర్టు దృష్టికి తీసుకెళ్లాలనుకుంటున్నారు.
ప్రభుత్వం కోర్టు ధిక్కరణకు పాల్పడటం ఇదే మొదటి సారి కాదు. దాదాపుగా తాము చేయకూడదనుకున్న ప్రతి విషయంలోనూ అదే పరిస్థితి. కోర్టుల నిర్ణయాలకు వక్రభాష్యాలు చెప్పుకోవడం లేదా.. ధిక్కరణకు పాల్పడటం కామన్ అయింది. చివరికి కోర్టు ఆగ్రహిస్తే.. అప్పటికప్పుడు చేస్తామని చెబుతున్నారు. ఇప్పుడు కూడా ఏబీవీ కోర్టు ధిక్కరణ పిటిషన్ వేసి.. విచారణ చివరికి వచ్చాక..ఏదో ఓ పోస్టింగ్ ఇచ్చామనిపిస్తారనే వ్యూహాన్ని అమలు చేస్తారని అంటున్నారు.