ఏపీ ప్రభుత్వంలోని ఉన్నతాధికారులు కోర్టు ధిక్కరణ కేసులు తమ మెడకు చుట్టుకుంటూడంతో చీఫ్ సెక్రటరీపై తీవ్ర ఒత్తిడి తీసుకువస్తున్నట్లుగా తెలుస్తోంది. ప్రభుత్వ ఆదేశాలను పాటించమని ఆదేశించే తమను.. కోర్టు ధిక్కరణ కేసుల నుంచి ఎందుకు కాపాడటంలేదని వారు సీఎస్‌పై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. శ్రీలక్ష్మి ఇప్పటికే తన పేరుతో అఫిడవిట్లు సమర్పించవద్దని తేల్చి చెప్పడంతో ఆ మేరకు ఉత్తర్వులు ఇచ్చారు. ఇతర అధికారులు కూడా అదే బాటలో ఉన్నారు. కోర్టు ధిక్కరణ కేసుల్లో నిర్ణయాలు తమవి కాదన్నట్లుగా ఉండే ఉత్తర్వుల కోసం ఒత్తిడి పెంచుతున్నట్లుగా చెబుతున్నారు.
హైకోర్టులో కొన్ని వందల కేసుల కోర్టు ధిక్కరణ కేసులు ఉన్నాయి. బిల్లులు చెల్లింపు కేసులో ఎక్కువ. ప్రభుత్వం నిధులివ్వదు. చెల్లిస్తే బయటపడొచ్చు.కానీ ప్రభుత్వం ఇవ్వకపోవడం వల్ల తాము జైలుకెళ్లాల్సిన పరిస్థితి వస్తోందని.. దీన్ని సీఎస్‌గా ఎలా చూస్తూ ఉండిపోతారని సివిల్ సర్వీస్ అధికారులు ప్రశ్నిస్తున్నట్లుగా తెలుస్తోంది.అందుకే ఈ అంశంపై సీఎస్ ప్రత్యేకంగా సమీక్ష చేయాలని నిర్ణయించారు. శుక్రవారం అన్ని శాఖల అధికారులతో కోర్టు ధిక్కరణ కేసులపై సమీక్ష చేయనున్నారు.
ఇక నుంచి ఒక్క అధికారికి కూడా శిక్ష పడకుండా చూస్తామని సీఎస్ హామీ ఇస్తున్నారు. కానీ అలా చేయాలంటే కోర్టు ఉత్తర్వులను పాటించాలని.. వందల కేసుల్లో కోర్టు ఇచ్చిన ఉత్తర్వులు ఇంకా పాటించలేదని సివిల్ సర్వీస్ అధికారులు అంటున్నారు. శుక్రవారం సమీక్షలో కోర్టు ఉత్తర్వులు పాటించకుండా ఉన్న వేవో కూడా పరిశీలించనున్నారు. అన్ని ఉత్తర్వులు అమలు చేసేందుకు ప్రయత్నించనున్నారు. మొత్తానికి ఉన్నతాధికారుల్లో కోర్టు గండం గట్టిగా నే కనిపిస్తోంది.