అసెంబ్లీ కార్యదర్శి బాలకృష్ణమాచార్యులకు హైకోర్టు శిక్ష విధించింది. హైకోర్టు ఆదేశాలను ఉద్దేశపూర్వకంగా ఉల్లంఘించినందున ఆయనకు శిక్ష విధిస్తున్నట్లుగా హైకోర్టు తెలిపింది. కొద్ది రోజుల కిందటే.. ఆయన కోర్టు ధిక్కరణకు పాల్పడినట్లుగా ధర్మాసనం ప్రకటించింది. శిక్షను మాత్రం గురువారం ఖరారు చేశారు. హైకోర్టు విధించిన శిక్ష ప్రకారం.. సాయంత్రం కోర్టు సమయం ముగిసే వరకు కోర్టులోనే కూర్చున్నారు. అలాగే వెయ్యి జరిమానా విధించారు. జరిమానా చెల్లించకుంటే వారం రోజులు జైలు శిక్ష అనుభవించాలని ఉత్తర్వులు జారీ చేశారు.
అసలు కోర్టు ధిక్కరణకు పాల్పడిన అంశం..అసెంబ్లీ చట్టాలు కాదు.. 2017లో ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల విషయంలో హైకోర్టు ఇచ్చిన తీర్పు అమలు చేయకపోవడం. అప్పట్లో కోర్టు ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు మద్దతుగా తీర్పు ఇచ్చింది. కానీ.. దాన్ని అమలు చేయడానికి బాలకృష్ణమాచార్యులు వెనుకాడారు. ఎవరి ఒత్తిడి ఉందో కానీ.. ఉత్తర్వులు అమలు చేయకపోవడంతో వారు మళ్లీ కోర్టుకెళ్లారు. చివరికి కోర్టు ధిక్కరణ కేసు నమోదయింది. నిజానికి బాలకృష్ణమాచార్యులు ఎప్పుడో రిటైరయ్యారు.
ఆయన పదవీ కాలాన్ని ప్రభుత్వం పొడిగించింది. ఆయన స్థానంలో వేరే వ్యక్తి అసెంబ్లీ కార్యదర్శిగా ఉంటే.. ఈ శిక్ష ఆయనే అనుభవించాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు బాలకృష్ణమాచార్యులు అనుభవించారు. ఓ ఉద్యోగి కోర్టు ధిక్కరణకు పాల్పడిన శిక్ష అనుభవించడం అంటే.. సర్వీస్‌లోనే మచ్చగా ఉండిపోతుంది. రిటైరైన తర్వాత బాలకృష్ణమాచార్యులకు ఆ ఇబ్బంది వచ్చింది.