చట్టాలను పాటించి.. ప్రజల హక్కులను కాపాడాల్సిన కలెక్టర్లు … ప్రభుత్వం చెప్పినట్లు చేసి ప్రజా హక్కులను కాలరాస్తే.. చట్టాన్ని పట్టించుకోకపోతే.. ఎప్పటికైనా ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతాయని మరోసారి రుజువైంది. తెలంగాణ హైకోర్టు ఇద్దరు కలెక్టర్లు మూడు నెలల జైలు శిక్ష విదిస్తూ తీర్పు చెప్పింది. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా అనంతసాగర్ రిజర్వాయర్ కు భూసేకరణను కలెక్టర్, డిప్యూటీ కలెక్టర్ జరిపారు. అయితే పరిహారం చెల్లించలేదు. బాధితులు కోర్టుకు వెళ్లారు. కోర్టు పరిహారం ఇచ్చిన తర్వాత మాత్రమే నీటి నిల్వ చేయాలని హైకోర్టు ఆదేశించింది.
అయితే వారి నివాసాలకు మాత్రమే పరిహారం ఇచ్చిన కలెక్టర్, డిప్యూటీ కలెక్టర్… అనంతసాగర్లో నీరు నిర్వ చేశారు. ఈ కారణంగా పరిహారం ఇవ్వని మూడు వందల ఎకరాల వరకూ ముంపునకు గురయ్యాయి. దీంతో రైతులు కోర్టు ధిక్కరణ పిటిషన్ ను హైకోర్టులో వేశారు. విచారణ జరిపిన హైకోర్టు.. కలెక్టర్ , డిప్యూటీ కలెక్టర్ కోర్టు ధిక్కరణకు పాల్పడినట్లుగా నిర్ధారించింది. మూడు నెలలసాధారణ జైలు శిక్ష విధించింది. శిక్షకు గురైన ఇద్దరిలో ఒకరు ప్రస్తుతం రాజన్న సిరిసిల్ల కలెక్టర్ కృష్ణభాస్కర్ మరొకరు ప్రస్తుతం వనపర్తి జిల్లా కలెక్టర్ గా ఉన్న యాస్మిన్ భాష. వీరితో పాటు భూసేకరణ అధికారిగా ఉన్న ఎన్ . శ్రీనివాసరావుకు కూడా శిక్ష విధించారు.
శిక్షపై అప్పీల్ చేసుకోవడానికి అధికారులు ఆరువారాల సమయం ఇచ్చింది. అప్పటి వరకూ శిక్ష ను అమలు చేయరు. అయితే తీర్పును వారి సర్వీసు రికార్డుల్లో దీనిని నమోదు చేయాలని హైకోర్టు ఆదేశించింది. ఇటీవలి కాలంలో అధికారులు ప్రభుత్వాలు చెప్పినట్లుగా చేస్తూ.. చట్టాలను అతిక్రమిస్తున్నారు. అలాంటి వారికి.. ఈ తీర్పు మేలుకొలుపులా ఉండే అవకాశం ఉంది.