తెరాసకు ప్రత్యామ్నాయం తామే అనుకున్న కమలం పార్టీ, మున్సిపల్ ఎన్నికల్లో అధికార పార్టీకి ఎక్కడా గట్టిపోటీ ఇచ్చిన దాఖలాలు లేవు. అయితే, ఈ ఓటమిని తనదైన శైలిలో విశ్లేషించారు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్. నైతికంగా తాము విజయం సాధించామని అన్నారు! మాఫియా అభ్యర్థుల్ని పోటీలో పెట్టలేదనీ, డబ్బుతో ఓటర్లను ప్రలోభాలకు గురిచెయ్యలేదన్నారు. గడచిన అసెంబ్లీ ఎన్నికల్లో ఒక్క స్థానామే గెలుచుకున్నామనీ, ఆ తరువాత జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో నాలుగు ఎంపీలకు ఎదిగామనీ, ఇప్పుడు మున్సిపాలిటీల్లో కూడా ఓటింగ్ శాతం గణనీయంగా పెరిగిందన్నారు.
2014లో టీడీపీతో పొత్తు పెట్టుకుని, పరిమిత స్థానాల్లో పోటీ చేసి మంచి స్థానాలే గెలుచుకున్నామన్నారు. అయితే, ఇప్పుడు జరిగిన ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేశామన్నారు. ఈ రాష్ట్రంలో ఇతర పార్టీలతో ప్రమేయం లేకుండా ఒంటరిగా ఎన్నికలకు వెళ్లింది భాజపా మాత్రమే అన్నారు. మజ్లిస్ తో కలిసి తెరాస పోటీ చేసిందనీ, కాంగ్రెస్, టీడీపీ, కమ్యూనిష్టులు కలిసి ఎన్నికలకు వెళ్లారన్నారు. తాము పోరాడింది కేవలం పార్టీలూ కూటములతో మాత్రమే కాదు… తెరాస మాఫియాతో, ఇసుక, మద్యం, కాంట్రాక్టర్ల మాఫియాలతో అన్నారు. చివరికి, అధికార పార్టీకి కొమ్ముకాసే పోలీసు యంత్రాంగంతో కూడా పోరాడాల్సి వచ్చిందన్నారు. క్రమంగా చూసుకుంటే తెరాస గ్రాఫ్ పడుతుంటే, భాజపా గ్రాఫ్ పెరుగుతోందన్నారు.
ఎన్నికల్లో ఓటమిని హుందాగా అంగీకరించడం అనేది ఒకటి ఉంటుంది! దాన్ని ఒప్పుకునే పరిస్థితిలో లక్ష్మణ్ లేనట్టున్నారు. ప్రజాతీర్పుని గౌరవిస్తున్నామనీ, తమ వైఫల్యాన్ని పార్టీలో అంతర్గతంగా చర్చించుకుంటామనీ, ప్రజలకు చేరువయ్యేలా వ్యూహాలు మార్చుకుంటామని ప్రకటన చెయ్యాల్సిన సందర్భం ఇది. ఒంటరిగా పోరాటం చేయడమే గెలుపు అన్నట్టుగా విశ్లేషించుకుంటే… పార్టీపరంగా లోపాలను గుర్తించే పరిస్థితి, విశ్లేషించుకునే అవకాశం కేడర్ కి ఎక్కడ ఇస్తున్నట్టు? తెలంగాణలో ఎన్నికలను ఎదుర్కొనే నైపుణ్యం భాజపాకిగానీ, కాంగ్రెస్ కి గానీ ఇంకా అలవాటు కావడం లేదు. అధికార పార్టీ పకడ్బందీ వ్యూహాలను తట్టుకుని నిలిచే మార్గాలను అన్వేషించనంత కాలం, ఇలాంటి కంటి తుడుపు ప్రకటనలతో వాస్తవిక దృక్పథంవైపు కేడర్ ను నడిపించలేనంత కాలం… ఓటమిలో గెలుపు ఉందనే విశ్లేషణలు ఎన్ని చేసుకున్నా ప్రయోజనం ఉండదు.