ఉన్న ఊళ్ళో పనులు దొరక్క, పిల్లలకు కొంచెం మంచి తిండి పెట్టుకొని నాలుగు రాళ్ళు వెనకేసుకొందామని ఎంతో ఆశతో తమ రెక్కల్ని నమ్ముకొని, కడుపు చేతపట్టుకుని ఊరు కాని ఊరు వచ్చి పగలనక రేయనక కష్టపడి పని చేసుకునే వారు. అదే మనం ‘వలస కూలీలు ‘ అని పిలిచే మన సాటి భరత మాత ముద్దుబిడ్డల నెత్తిన ఒక్కసారిగా ఈ కొరోనా ఉపద్రవం వచ్చి పడింది. ఒక్కసారిగా పనులు ఆగిపోయాయి. కూలీ లేదు. పలకరించే దిక్కు లేదు.ఎవరిని ఏమి అడగాలి అన్నా తెలిసిన పలకరించే ప్రాణి లేదు. చాలా మంది విషయంలో భాష కూడా చాలినంత లేదు. ఒక రోజు,ఇంకొక్క రోజు అనుకుంటూ ఉంటే చూస్తూండగానే చేతిలో ఉన్న కాసిని చిల్లర డబ్బులు కూడా ఖాళీ అయిపోతే. దిక్కు తోచక తమ ఊరి/రాష్ట్రం దిక్కుగా మరో దారి కనపడని, కాళ్ళకు చెప్పులు కూడా లేని మన బాంధవులు మూటా ముల్లె నెత్తిన పెట్టుకొని నడక సాగించారు. వెళ్ళాలిసిన దూరం ఒకటీ రెండూ కిలో మీటర్లు కాదు. కొన్ని వందల కిలోమీటర్లు సాగాలి. జేబులు ఖాళీ, కడుపు ఖాళీ. సొంత ఊరికి చేరుకోగలిగితే చాలు. ఎలాగోలా నా కుటుంబాన్ని కాపాడుకుంటాను అన్న ఒకే ఒక్క ఆశ వాళ్ళని నడిపిస్తోంది.
గుండెల మీద ఆడించుకోవాలిసిన చిట్టి చిట్టి పాదాలతో, తీరని ఆకలితో తల్లిదండ్రులతో తరలి పోతున్న ఆ చిన్నారులను చూసి తట్టుకోలేక మనకు చేతనయినది మనము చెయ్యాలి అని నిండు మనసుతో మండుటెండలను సైతం పట్టించుకోకుండా ముందుకు వచ్చి గత పదిహేను రోజులుగా నిరంతరం వంతులవారీగా వండి పెడుతున్న మన నిడమానూరు ప్రాంత రైతు బిడ్డలకు వందనం పాదాభివందనం.
మీరు ఏమి ఆశించి ఈ పని చేస్తున్నారు అని అడిగితే వారు చెప్పిన సమాధానం ‘వీళ్ళు ఎంతో దూరం నుంచి మన పనులు చేసి పెట్టడానికి ఇక్కడకు వచ్చారు. వారికి ఇంత కష్టం వచ్చినపుడు వారి పక్కన నిలచి పట్టెడన్నం కూడా పెట్టకుండా ఏ రైతుబిడ్డయినా ఎలా ఉండ గలడు? ఈ మాత్రం కూడా చెయ్యలేకపోతె ఇంక మానవత్వమన్నదానికి విలువేముంది.’
మీకింకెవరయినా సాయం చేస్తున్నారా అని అడిగితే ‘ఈ ప్రాంతం నుంచి వెళ్ళిన కొంతమంది NRI పిల్లలు తప్పితే బయట నుంచి పెద్ద సాయమేమీ అందలేదన్నారు. ఇంకెవరయినా దాతలు ముందుకు వస్తే మరింత మందికి సాయం చేయ గలమన్నారు.
ఈ విషయం మిత్రుల ద్వారా విన్న పారిశ్రామికవేత్త రవి మాదల గారు అభినందిస్తూ, ఈ సందర్భంలో ఆరోగ్యాన్ని కూడా జాగ్రత్తగా చూసుకోవాలని తమవంతు సాయంగా PPE సరంజామా పంపిస్తామని చెప్పారు.
వీరు గత రెండు వారాలుగా నిరంతరంగా ఆహారము, నిత్యావసర వస్తువులు, చెప్పులు వగైరాలను టీ నగర్, 100 కిమీ రోడ్డు, ఏలురు, పొట్టీపాడు టోల్ గేటులవద్ద, నిడమానూరు బైపాస్, బెంజ్ సర్కిల్, రామవరప్పాడు రింగు రోడ్డు, మంగళగిరి బైపాస్ వద్ద ఉన్న వారికి అందజేస్తున్నారు.
ఈ కార్యక్రమంలో చేదోడు వాదోడుగా నిలిచిన నిడమానూరు రైతుబిడ్డలు సర్వశ్రీ శ్రీధర్ నాగళ్ళ, హేమంత్ నాగళ్ళ, కౌశల్ కృష్ణ కర్రి, మౌనిక చిన్నమనేని, నందిని నాగళ్ళ, లక్ష్మణ రావు ఈడుపుగంటి, సుబ్బారావు, విక్రం ఆదిలక్ష్మి, కాటమనేని సర్వేశ్వర వర ప్రసాదు, యశ్వంత్ వల్లూరు, శంకరరావు పరిమి.
ఎవరో వచ్చి మెచ్చుకుంటారనో, ఏలుబడివారు వచ్చి ఏదో ఇచ్చేస్తారనో మేమిదంత చేయడం లేదండి.కష్తంలో ఉన్నవాడికి చేతనయిన సాయం చేయాలన్న ఆలోచనతో చేస్తున్నాము. ఎవరయిన చేయందిద్దామనుకుంటే స్వాగతం. మరింత మందిని ఆదుకోవచ్చు. లేదంటె మా శక్తి ఉన్నంత వరకు మా సాయం కొనసాగుతుంది అని తెలిపారు.