ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ పనులు చేసే చిన్నా చితకా కాంట్రాక్టర్లు ఆందోళన బాట పట్టారు. భిక్షాటన లాంటి నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ప్రభుత్వంపై తీవ్రంగా విరుచుకుపడుతున్నారు. ఒకటి కాదు రెండు కాదు రెండేళ్లుగా తమకు చెల్లింపుల్లేవని.. అప్పులు తెచ్చి చేసిన పనులకు బిల్లులు ఇవ్వకపోతే తామెలా బతకాలని వారు అంటున్నారు. ప్రభుత్వంలో ఏ పని జరగాలన్నా కాంట్రాక్టర్లే చేయాలి. చివరికి ముఖ్యమంత్రి జగన్ ప్రమాణస్వీకార వేదికను కూడా అధికారులు సిద్ధం చేయరు. కాంట్రాక్టర్లే సిద్ధం చేశారు.
వాటికి సంబంధించిన బిల్లును ప్రత్యేక జీవో ద్వారా ఏడాది తర్వాత చెల్లించారు. కానీ అలాంటి పరిస్థితులు.. అవకాశాలు ఇతర కాంట్రాక్టర్లకు రావడం లేదు. ప్రభుత్వం చేయించిన పనులేవీ బిల్లుల వరకూ రావడం లేదు. దీంతో కాంట్రాక్టర్లు రోడ్డున పడుతున్నారు. గత ప్రభుత్వంలో పనులు చేసిన కాంట్రాక్టర్లకు ఆపుతున్న బిల్లులు మాత్రమే కాదు ప్రస్తుత ప్రభుత్వంలో పనులు చేస్తున్న వారికీ బిల్లులు రావడంలేదు . ఇప్పటి వరకూ ఓపిక పట్టిన వారు ఇప్పుడు రోడ్డెక్కారు. తమ బిల్లులు చెల్లించాల్సిందేనని ఆందోళనలు చేస్తున్నారు. ప్రభుత్వం స్పందించకపోతే కోర్టుకెళ్లాలని నిర్ణయించుకున్నారు.
కోర్టుకెళ్తే ఇంకా ఆలస్యం అవుతుందేమోనన్న భయంతోనే ఆగుతున్నారు. కానీ వారి భయాన్ని ప్రభుత్వం మరోలా అర్థం చేసుకుంది. ఫలితంగా చేసిన పనులకు నిధులు రాలడం లేదు. అయితే వీరంతా చిన్న, మధ్య స్థాయి కాంట్రాక్టర్లు మాత్రమే.. బడా కాంట్రాక్టర్లు ఇంకా తెరపైకి రాలేదు. వారికి సరిగ్గా చెల్లింపులు చేస్తున్నారని.. చిన్న వారిని మాత్రమే వేధిస్తున్నారన్న ఆరోపణలు కాంట్రాక్టర్ల నుంచి వస్తున్నాయి.