బాలీవుడ్ సినిమా అగ్ర నటుల్లో సంజయ్ దత్ ఒకరు. ఖల్ నాయక్‌గా సంజయ్‌దత్‌కు ఉన్న క్రేజే వేరు. ఈ క్రేజీ నటుడు ఇప్పుడు హీరోగానే కాదు.. విలన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా కూడా తనదైన నటనతో ఆకట్టుకుంటున్నారు. తాజా సమాచారం ప్రకారం ఈ విలక్షణ నటుడు ఓ భారీ బడ్జెట్ దక్షిణాది చిత్రంలో నటించబోతున్నాడట. 1998లో నాగార్జున, రమ్యకృష్ణ నటించిన `చంద్రలేఖ` సినిమాలో ఈయన చిన్న అతిథి పాత్రలో నటించిన సంగతి తెలిసిందే. 21 ఏళ్ల తర్వాత దక్షిణాది సినిమాలో నటించబోతున్నారు సంజయ్ దత్. వివరాల్లోకెళ్తే.. గత ఏడాది డిసెంబర్లో దక్షిణాది భాషలు సహా హిందీలో కూడా విడుదలై సెన్సేషనల్ హిట్ అయిన `కె.జి.యఫ్ చాప్టర్ 1`కు కొనసాగింపు `కె.జి.యఫ్ చాప్టర్ 2` ను రూపొందించనున్నారు. ఈ కొనసాగింపులో ఓ కీలక పాత్రధారిగా సంజయ్‌దత్‌ను తీసుకోబోతున్నారని సినీ వర్గాల సమాచారం. పర్టికులర్‌గా సంజయ్‌దత్‌ను ఎంచుకోవడానికి కారణమేంటో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ సినిమాకు దక్షిణాదిలో ఎలాగూ క్రేజ్ ఉంది. హిందీ మార్కెట్‌ను బేస్ చేసుకుని మార్కెట్ ఫరిధిని పెంచడానికే సంజయ్‌దత్‌ను ఎంచుకుంటున్నారని టాక్. ఈ సినిమా 2020 చివర లేదా 2021లో విడుదలయ్యే అవకాశాలున్నాయని వార్తలు వినపడుతున్నాయి.