మంత్రి కొండా సురేఖ ఒక్కసారిగా బ్లాస్ట్ అయి..తనకు వస్తోన్న సానుభూతిని తనే బీఆర్ఎస్ కు సరెండర్ చేశారు. సోషల్ మీడియాలో కొండా సురేఖ టార్గెట్ గా బీఆర్ఎస్ ట్రోల్ చేయడం వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. ఈ విషయంలో మొదట్లో కొండా సురేఖకు రాజకీయాలకు అతీతంగా మద్దతు లభించగా.. బీఆర్ఎస్ సోషల్ మీడియా తీరుపై ఆగ్రహావేశాలు వ్యక్తం అయ్యాయి.
చెల్లికి వేసినట్టుగా నూలు దండ మెడలో వేస్తే అభ్యంతరకరంగా పోస్టింగ్ లు పెట్టడంపై కేటీఆర్ ను కొండా సురేఖ క్షమాపణలు కోరారు. ఇదంతా బీఆర్ఎస్ సోషల్ మీడియా పనేనని..కేటీఆర్ క్షమాపణలు చెప్పాలని సురేఖకు మద్దతుగా డిమాండ్లు వచ్చాయి. కానీ, ఇంతలోనే కొండా సురేఖ ఈ విషయంపై మరోసారి స్పందిస్తూ సినీ ఇండస్ట్రీలో హీరోయిన్లు త్వరగా పెళ్ళిళ్ళు చేసుకోవడానికి కారణం కేటీఆరేనని వివాదాస్పద కామెంట్స్ చేసి, విషయాన్ని ఒక్కసారిగా టర్న్ చేశారు.
ఎన్ కన్వెషన్ కూల్చివేయకుండా ఉండాలంటే సమంతను తన దగ్గరకు పంపాలని కేటీఆర్ కండిషన్ పెట్టారని, నాగార్జున, నాగ చైతన్య మాట్లాడి సమంతను కేటీఆర్ దగ్గరికి వెళ్లాలని ఒత్తిడి చేశారని కొండా సురేఖ ఆరోపించారు. అందుకు సమంత నిరాకరించడమే డివోర్స్ కు దారితీసిందని జోస్యం చెప్పారు. అదే సమయంలో రకుల్ ప్రీత్ సింగ్ కూడా వెనువెంటనే పెళ్లి చేసుకోవడానికి కారణం కేటీఆర్ అని..హీరోయిన్స్ కు మత్తుమందు అలవాటు చేసింది ఆయనేనని సంచలన ఆరోపణలు చేశారు.
కొండా సురేఖ.. కేటీఆర్ ను టార్గెట్ చేయబోయి ఈ ఎపిసోడ్ లోకి నాగార్జున ఫ్యామిలీని సైతం లాగినట్లు అయింది. కేవలం ఓ కన్వెషన్ కోసం సమంతను వదులుకునేందుకు నాగార్జున, నాగ చైతన్యలు సిద్దపడ్డారా? కొండా సురేఖ చేసిన ఈ వ్యాఖ్యల్లో ఏమాత్రం విశ్వసనీయత లేదని.. ఓ వ్యక్తిని టార్గెట్ చేసేందుకు రాజకీయాలతో సంబంధం లేని ఇతరులను కూడా వివాదంలోకి లాగుతారా? అని ఆగ్రహం వ్యక్తం అవుతోంది.