మాట్లాడితే కులాల గురించి మాట్లాడుతున్న పవన్ కల్యాణ్‌పై అన్ని వైపుల నుంచి విమర్శలు వస్తున్నాయి. కులాలను రెచ్చగొడుతున్నారన్న ఆరోపణలు రావడంతో ఆయన తనంతటకు తానుగా వివరణ ఇచ్చుకున్నారు. తనను ఓ సోషల్ డాక్టర్‌గా మాత్రమే చూడాలని … కులాలను రెచ్చగొట్టేందుకు తాను రాజకీయం చేయడం లేదని వివరణ ఇచ్చారు. తెలంగాణ జనసేన పార్టీ కార్యకర్తల సమావేశం ఏర్పాటుచేసి.. ఆంధ్రా గురించి ఎక్కువగా మాట్లాడారు. ఈ క్రమంలో ఆయన కులాల ప్రస్తావన తీసుకు వచ్చారు. తను సామాజిక న్యాయం కోసం.. సోషల్ డాక్టర్‌గా వ్యవహరిస్తున్నట్లుగా చెప్పుకొచ్చారు.
అన్ని వర్గాలకు రాజకీయ న్యాయం కోసం తాను మాట్లాడానని పవన్ కల్యాణ్ అంటున్నారు. ఏపీలో ఓ కులాన్ని వర్గ శత్రువుగా చేసుకోవడం వల్ల అభివృద్ధి ఆగిపోయిందని తెలంగాణ కార్యకర్తలకు ఉద్భోధించారు. ఈ సందర్బంగా తాను కులాలపై చేస్తున్న వ్యాఖ్యలను సోషల్ డాక్టర్ పద్దతిలోనే చూడాలని సలహా ఇచ్చారు. కారణం ఏదైనా కానీ.. రాజకీయాల్లో అంతర్గతంగానే ఉండాల్సిన కులాల అంశాన్ని ఇటీవల రాజకీయ పార్టీలు తెరపైకి తెస్తున్నాయి. గతంలో ఆయా కులాల్ని మంచిచేసుకునేందుకు ప్రయత్నించేవారు. తర్వాత ఓ కులాన్ని శత్రువుగా చూపించి రాజకీయం చేశారు. ఇప్పుడు పవన్ కల్యాణ్ అన్ని కులాల పేర్లను ప్రస్తావిస్తూ రాజకీయాలు చేస్తున్నారు.
తనది కుల రాజకీయం అని వస్తున్న విమర్శలకు కౌంటర్ ఇచ్చేందుకు పవన్ కల్యాణ్ కష్టపడుతున్నారు. సామాజిక న్యాయం చేయడానికే తాను ప్రయత్నిస్తున్నానని నమ్మించేందుకు ప్రయత్నిస్తున్నారు. మరి ఈ విషయంలో ప్రజలు పవన్ కల్యాణ్‌ను సోషల్ డాక్టర్‌గా గుర్తిస్తారో లేదో చూడాలి మరి !