టిటిడిపి నాయకులతో భేటీలో జాతీయ అద్యక్షుడు చంద్రబాబు నాయుడు చేసిన దిశా నిర్దేశం ఏమిటి? దిశ తెలియడం లేదు గనక మాట్లాడకుండా మౌనం పాటించండి.. అని మాత్రమే. రోజులు గడిచే కొద్ది ఈ భేటిపై ఎవరికి తోచిన భాష్యాలు వారు చెబుతున్నారు. ఈ లోగా ఆయనే అమరావతి వెళ్లి టెలికాన్ఫరెన్స్ పెట్టి ఎపి నాయకులపైనా చిరాకు పడ్డారు. అయితే అందులో ఆంతర్యమేమి? టిఆర్ఎస్తో పొత్తుకే అవకాశముంటే పయ్యావుల కేశవ్ వంటివారిని ఎందుకు విమర్శిస్తారు? అని ఒక సీనియర్ నేత ప్రశ్న. కాంగ్రెస్తో వెళ్లాలనే రేవంత్ రెడ్డి మాటలనే వైఖరి సరైందైతే అప్పటికే అమలైపోయిందాన్ని ఆమోదించి వుండేవారు కదా అని మరో వర్గం ప్రశ్న. ఇంతకూ ఏమన్నారు మరి.. ఏమీ అనొద్దన్నారు. అంతే! ఏది ఏమైనా ఈ సమావేశం తర్వాత రేవంత్ రెడ్డి వంటివారి స్పందనలు పార్టీ నుంచి వెళ్లిపోతారనీ చీలిక వస్తుందనీ కథనాలు ప్రత్యక్షమవుతున్నాయి. టిడిపికి ఇప్పటికీ తెలంగాణలో నెట్వర్క్ వుందని కెసిఆర్ నమ్ముతున్నారట. భవనాలు వూరూరా వున్నాయి. బలమైన నాయకులూ వున్నారు గనక ఉపయోగించుకోవచ్చునని పాలకపక్షం భావిస్తుండొచ్చు. ఇక బిజెపిలోనూ ఎపి, తెలంగాణలలో రెండు వాదనలు వున్నాయి. ఒకటి ఆరెస్సెస్ వాదం మరొకటి బిజెపి వాదం. రెండు చోట్ల పాలకపక్షాలతో కలసి వుంటే కేంద్రంలో మంచిదని రాజకీయ నాయకత్వం, స్వంత పునాది పెంచుకోవాలి తప్ప దీనివల్ల వొరిగేది లేదని ఆరెస్సెస్ వర్గం తర్జనభర్జన పడుతున్నాయి. ఆ చర్చ ఒక కొలిక్కి రావాలంటే మరో అయిదు రాష్ట్రాల ఎన్నికల పలితాలు రావాలి. అప్పటి వరకూ అయోమయమే అన్నది చంద్రబాబు సందేశం. ఓటుకు నోటు కేసులో రేవంత్ రెడ్డి తీసుకునే వైఖరి ఆయన పట్ల టిఆర్ఎస్ ప్రభుత్వం అనుసరించే వైఖరి కూడా ఈ విషయంలో కీలక ప్రభావం చూపించొచ్చు. ప్రభుత్వాలు తలుచుకుంటే కేసుల వేగం నెమ్మది ఎలా వుండేది జగన్ కేసులో అర్థమవుతున్నది. అది సిబిఐ తరపున వుంటే ఓటుకు నోటు ఎసిబి పరిదిలోదే గనక మరిన్ని మలుపులకు అవకాశం వుంటుంది.