బీఆర్ఎస్ పార్టీని టార్చర్ పెట్టే కొద్దీ టార్చర్ పెడుతున్నారు కాంగ్రెస్ నేతలు. పీఏసీ చైర్మన్ పదవిని అరికెపూడి గాంధీకి ఇచ్చి జరగాల్సినంత రచ్చ జరిగేలా చేసిన కాంగ్రెస్ తాజాగా మండలిలో చీఫ్ విప్ పదవిని పట్నం మహేందర్ రెడ్డికి ఇచ్చారు. ఆయన అధికారికంగా బీఆర్ఎస్ ఎమ్మెల్సీ. ఈ నియామకంపై హరీషష్ రావు ఫైర్ అయ్యారు. . బిల్లులు పాస్ చేయించడం, మండలిలో ప్రభుత్వ కార్యక్రమాలు సజావుగా జరిగేలా చూసే బాధ్యత చీఫ్ విప్‌కు ఉంటుందని ఇప్పుడు .. మహేందర్ రెడ్డి విప్ జారీ చేస్తాడా.. లేక బీఆర్ఎస్ పార్టీ ఇచ్చిన విప్ ను పాటిస్తాడా అని ప్రశ్నించారు.
బిఆర్ఎస్ పార్టీ విప్ ప్రస్తుత చీఫ్ విప్ కు విప్ జారీ చేసే పరిస్థితి వచ్చిందని.. రాష్ట్రంలో ఖూనీ చేస్తున్నారనేందుకు ఇది మరో ఉదాహరణగా చెప్పుకొచ్చారు. శాసనమండలి చైర్మన్ దగ్గ మహేందర్ రెడ్డి అనర్హత పిటిషన్ పెండింగ్ లో ఉందన్నారు. ఇలాంటి సమయంలో అధికార పార్టీ చీఫ్ విప్ గా అదే కౌన్సిల్ చైర్మన్ ఎలా నియమిస్తారని ప్రశ్నించారు. మహేందర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి తరపున ఎన్నికల్లో ప్రచారం చేశాడని.. పార్టీ ఫిరాయింపు చేశాడని స్పష్టంగా అర్థమవుతుందన్నారు. అనర్హత వేటు వేయాల్సిన కౌన్సిల్ ఛైర్మన్ స్వయంగా .. పట్నం మహేందర్ రెడ్డి చీఫ్ విప్ ఎంపికైనట్లు బులెటిన్ ఇవ్వటం రాజ్యాంగ విరుద్దమని మండిపడ్డారు.
అరికెపూడి గాంధీ.. బీఆర్ఎస్ ఎమ్మెల్యే అని స్వయంగా సీఎం, మంత్రులు చెప్పారని.. పట్నం మహేందర్ రెడ్డి ఏ పార్టీకి చెందిన వ్యక్తో ప్రభుత్వం చెప్పాలని డిమాండ్ చేశారు. హరీష్ రావు గతంలో శాసనసభ వ్యవహారాల మంత్రిగా చేశారు. అందుకే ఆయనకు ఎన్నెన్ని రూల్స్ గుర్తుకు వస్తున్నాయి. కానీ బీఆర్ఎస్ హయాంలో కాంగ్రెస్‌నూ ఇలాగే ఆటాడుకున్నారు. ఆ విషయాన్ని ఆయన మర్చిపోయినట్లుగా నటిస్తున్నారు.