ఓ అగ్ర కథానాయకుడి అరెస్ట్, మరో వెటరన్ హీరో ఇంటి గొడవ, ఓ యువ హీరో ఎఫైర్, లైంగిక వేధింపుల కేసులో ఓ జాతీయ అవార్డ్ వెనక్కి వెళ్ళిపోవడం.. ఇలా అనేక వివాదాలు ఈ ఏడాది టాలీవుడ్ ని హెడ్ లైన్స్ లో నిలిపాయి.
యువ హీరో రాజ్ తరుణ్ పై లావణ్య అనే యువతి చీటింగ్ కేసు పెట్టింది. పదేళ్ళు తనతో సహజీవనం చేసి, చాలాసార్లు సార్లు గర్భం తీయించి, తనని అన్ని విదాలుగా వాడుకొని, చివరికి మాల్వి మల్హోత్రా అనే హీరోయిన్ వలలో పడి, తనని దారుణంగా మోసం చేశాడని రాజ్ తరుణ్ పై లావణ్య తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేసింది. పోలీసులుని ఆశ్రయించింది. లావణ్య డ్రగ్స్ కు బానిస, తనతో నాకు సంబంధం లేదని రాజ్ తరుణ్ తన వెర్షన్ వినిపించాడు. ఈ కేసులో రోజుకో మలుపు తెరపైకి వచ్చింది.
లాయర్ కళ్యాణ్ దిలీప్ సుంకర, ఆర్ జే శేఖర్ బాషా ఈ వివాదంలోకి తల దూర్చిన తర్వాత మరిన్ని ఆడియోలు బయటికి వచ్చాయి. వరుసగా టీవీ ఛానల్స్ లో డిబేట్లు జరిగాయి. లావణ్య, రాజ్ తరుణ్ ని నీడలా వెంటాడింది. తన సినిమా ఈవెంట్లుకు వెళ్ళింది. మీడియా కూడా పెద్ద ఎత్తున ఈ ఎపిసోడ్స్ ని కవర్ చేసింది. చివరికి ఎలాంటి రాజీ కుదిరిందో కానీ లావణ్య సైలెంట్ కావడంతో ఈ వివాదం కొంత కాలానికి సద్దుమణిగింది.
జానీ మాస్టర్ పై తన సహాయకురాలు లైంగిక వేధింపు కేసు పెట్టింది. ఆమె మైనర్ కావడంతో కనీసం ఆమె పేరుని కూడా రివిల్ చేయకుండా కేసు నడిచింది. ఫిల్మ్ ఫెడరేషన్ ఈ వివాదంపై ప్రెస్ మీట్ పెట్టి కొన్ని వివరాలు వెల్లడించింది. ఈ కేసులో జానీ మాస్టర్ అరెస్ట్ అయ్యాడు. బెయిల్ మీద బయటికి వచ్చినప్పటికీ తనకు వచ్చిన జాతీయ అవార్డు ని కేంద్రం వెనక్కి తీసుకోవడంపై పెద్ద ఎత్తున చర్చజరిగింది. ఈ మొత్తం ఎపిసోడ్ లో ఓ అగ్ర హీరో బాధితురాలి వెనుక వున్నాడనే ఆరోపణ సోషల్ మీడియాలో బలంగా వినిపించింది. కొన్నాళ్ళకి బాధితురాలి ఓ ఆడియో టేప్ బయటికి వచ్చింది. అది విన్న జనాలు.. ఈ కేసుపై ఓ క్లారిటీకి వచ్చారు. ప్రస్తుతం జానీ మాస్టర్ బెయిల్ పై వున్నారు.
సీనియర్ నటుడు మోహన్ బాబు కుటుంబ కలహాలు రచ్చకెక్కాయి. కొన్నాళ్ళుగా నిగురుకప్పిన నిప్పులా వున్న వారి కుటుంబ గొడవలు ఒక్కసారిగా భగ్గుమన్నాయి. మోహన్ బాబు తనకు మనోజ్ వలన హాని వుందని కేసు పెట్టాడు. దీనికి ప్రతిగా మనోజ్ కేసు పెట్టాడు. పదిపేజీల లేఖ రిలీజ్ చేశాడు. ఆస్తుల కోసం కాదు ఇది తన ఆత్మగౌరవ పోరాటం అన్నాడు. మీడియాని వెంటబెట్టుకొని మోహన్ బాబు ఇంటికి వెళ్ళాడు. ఈ వివాదంలో బౌన్సర్లు అతి చేశారు. మోహన్ బాబు ఇంటి వద్ద ఓరకమైన యుద్ధ వాతావరణం నెలకొంది. సహనం కోల్పోయిన మోహన్ బాబు మీడియా ప్రతినిధి పై వీధిరౌడీల దాడి చేశాడు. ఈ దాడిలో మీడియా ప్రతిధిని గాయపడ్డాడు. కాసేపటికే మోహన్ బాబు ఆడియో రిలీజ్ చేసి మొత్తం ఎపిసోడ్ పై వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. అయితే అప్పటికే జరగాల్సిన డ్యామేజీ జరిగిపోయింది. క్రమశిక్షణ పాట పాడే మోహన్ బాబు అసలు నైజం జనాలు చూశారు. పోలీసులు చాలా సెక్షన్స్ కింద కేసులు పెట్టారు. ముందస్తు బెయిల్ కోసం ప్రయయత్నం చేస్తున్న మోహన్ బాబు అజ్ఞాతంలోకి వెళ్లారనే కథనాలు కూడా వినిపించాయి. ఈ మొత్తం వివాదంలో మోహన్ బాబు కచ్చితం కొన్ని పర్యవసనాలు ఎదుర్కోవాల్సి వస్తోంది.
రామ్ గోపాల్ వర్మ వైసీపీ వకాల్త పుచ్చికొని ఎన్నికల ప్రచార చిత్రాలుగా కొన్ని సినిమాల తీసి ఓ విఫలయత్నం చేశాడు. ఆ సినిమాలని ఎవరూ పెట్టించుకోలేదు. చివరికి తన ఎక్స్ అకౌంట్ లో మార్ఫింగ్ ఫోటోలు పోస్టు చేసుకునే స్థితికి దిగజారాడు. దీనిపై కేసులు నమోదయ్యాయి. పోలీసులు విచారణ హాజరుకావాలని కోరిన పక్షంలో అజ్ఞతంలోకి వెళ్ళాడు వర్మ. పోలీసులు అతని కోసం గాలించారు. లాయర్లుతో ముందస్తు బెయిల్ తెచ్చుకోవడానికి ప్రయత్నించాడు. ఈ కేసులో తనకు ఇబ్బంది లేదని తెలిసిన తర్వాతే మీడియా ముందుకు వచ్చాడు. సినిమా పని మీద బయటికి వెళ్లానని మీడియాతో చెప్పాడు. ఏం సినిమా అనే ప్రశ్నకు నీళ్ళు నమిలాడు. సమాధానం చెప్పడానికి వర్మ పడినని ఇబ్బంది చూసిన జనం నవ్వుకున్నారు. మొత్తానికి చావుతప్పి కన్నులోట్టబోయింది అన్నట్టుగా ఊపిరి పీల్చుకున్నాడు వర్మ.
నటి కస్తూరి తెలుగు ప్రజలపై చేసిన వాఖ్యలు వివాదమయ్యాయి. ఆమెపై కేసులు బనాయించారు. తమిళనాట అధికార పక్షం తనపై కుట్ర చేస్తుందని వాపోయింది కస్తూరి. ఈ కేసులో అరెస్ట్ నోటీసులు జారీ అయ్యాయి. ఆ క్రమంలో ఆమె అజ్ఞాతంలోకి వెళ్లినట్లుగా వార్తలు వచ్చాయి. ఈ మొత్తం ఎపిసోడ్ ఓ వారం రోజులు పాటు వార్తల్లో నిలిచింది.
యూట్యూబ్ వీడియోలతో పాపులరైన నటుడు ప్రసాద్ బెహరా లైంగిక వేధింపుల కేసులో అరెస్ట్ అయ్యాడు. ప్రసాద్ మంచి రైటర్, యాక్టర్. సినిమా అవకాశాలు వెదుక్కుంటూ వచ్చాయి. కమిటీ కుర్రాళ్ళు సినిమాలో మంచి పాత్ర పడింది. పరిశ్రమకి మంచి నటుడు దొరికాడని భావిస్తున్న తరుణంలో వేధింపుల కేసులో జైలుకి వెళ్ళడం కలకలం రేపింది.
2024లో టాలీవుడ్ సంచలనం అంటే అల్లు అర్జున్ అరెస్ట్. పుష్ప బెనిఫిట్ షో చూడటానికి సంధ్య థియేటర్ కి వెళ్లారు బన్నీ. దురదృష్టవశాత్తూ అక్కడ జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ చనిపోయింది, రేవతి కొడుకు తీవ్రంగా గాయపడి చావుబతుకుల మధ్య చికిత్స పొందుతున్నాడు. ఈ కేసులో అల్లు అర్జున్ ని ఏ 11గా చేర్చి అరెస్ట్ చేయడం దేశవాప్తంగా సంచలనం రేపింది.
ఈ కేసులో నాంపల్లి కోర్టు బన్నీకి 14 రోజుల రిమాండ్ విధించింది. ఈ వార్త దేశం మొత్తం దావాలంలా పాకింది. జాతీయ మీడియాలో పెద్ద ఎత్తున డిబేట్ జరిగింది. జాతీయ అవార్డు అందుకొని, పుష్ప తో ఇండియన్ సినిమాని బాక్సాఫీసు స్టామినాని పెంచిన ఓ హీరోని ఇలాంటి కేసులో అరెస్ట్ చేయడం తగదని కొందరు వాదిస్తే, చట్టం ముందు అందరూ సమానమే అని ఇంకొందరు చెప్పారు. చివరికి హైకోర్టులో బన్నీకి మధ్యంతర బెయిల్ దొరికింది. అయినప్పటికీ ఓ రాత్రి బన్నీ జైల్లో గడపాల్సివచ్చింది.
ఇంటికి వచ్చిన బన్నీకి ఇండస్ట్రీ నుంచి పెద్ద ఎత్తున సపోర్ట్ దొరికింది. అందరూ పరామర్శకి వచ్చారు. అయితే చనిపోయిన రేవతి కుటుంబానికి జరిగిన అన్యాయం ఎవరికీ కనిపించలేదా? అనే కోణంలో కొందరు మాట్లాడారు. ఈ విమర్శలు తీవ్రం కావడంతో కేసులో వున్న బన్నీ కాకుండా అల్లు అరవింద్ రేవతి కుటుంబాన్ని పరామర్శించారు. రేవతి కుటుంబానికి అన్ని విధాల ఆదుకుంటామని పుష్ప టీం అంతా చెబుతున్నారు. ఏదేమైనప్పటికీ పుష్ప ఇచ్చిన విజయం కంటే ఈ విషాదమైన వివాదమే దేశవ్యాప్తంగా సంచలనంగా మిగిలింది.