ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ ప్రకటించింది. అందులో జాబుల్లేవని నిరుద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇప్పుడు ప్రభుత్వం చేసిన పనుల వల్ల ఇప్పటి వరకూ చేపట్టిన ఉద్యోగ నియామకాల ప్రక్రియ మొత్తం తేడా పడే పరిస్థితి కనిపిస్తోంది. దీనికి కారణం ఏపీపీఎస్సీ చైర్మన్ ఉదయభాస్కర్ హైకోర్టులో దాఖలు చేసిన అఫిడవిట్. కొన్నాళ్ల కిందట గ్రూప్ వన్ పరీక్షలు జరిగాయి. టీడీపీ హయాంలో నోటిఫికేషన్ వచ్చింది. కొత్త ప్రభుత్వం మారిన తర్వాత పరీక్షల ఫలితాలను నిలిపివేశారు. ఆ తర్వాత ప్రభుత్వం మార్కుల మూల్యంకనంలో మార్పులు చేసింది. అర్హత సాధించిన వారి జాబితాను వెల్లడించింది. దీనిపై అభ్యర్థులు కోర్టులకు వెళ్లారు.
ఏపీపీఎస్సీ అక్రమాలకు పాల్పడిందని పిటిషన్లు వేశారు. దీంతో హైకోర్టు ఇంటర్యూలను నిలిపివేసింది. వాటిపై జరుగుతున్న విచారణలో ఏపీపీఎస్సీ చైర్మన్ ఉదయభాస్కర్ అఫిడవిట్ దాఖలు చేశారు. ప్రభుత్వం తన పని తనను చేసుకోనివ్వలేదని.. ఆఫీసుకు కూడా రానివ్వలేదని చాంబర్‌తో పాటు అటెండర్ ను కూడా ఇవ్వలేదని ఆయన కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. తన విధులను ఆటంక పరిచారని.. నిబంధనలకు విరుద్ధంగా సమావేశాలు నిర్వహించి నిర్ణయాలు తీసుకున్నారని.. ఆ నిర్ణయాలేవీ తన ఆమోదంతో జరగలేదని స్పష్టం చేశారు.
తాను గతంలో ఈ అంశంపై హైకోర్టులో కూడా పిటిషన్ వేశానన్నారు. ఏపీపీఎస్సీ చైర్మన్ పదవి రాజ్యాంగబద్ధమైనది. ప్రభుత్వం ఆయనను తొలగించలేక ఇతర అధికారుల్ని నియమించి ఎవరూ ఆయనకు సహకరించకుండాచేసింది. దీంతో సలాంబాబు అనే సభ్యుడే ప్రెస్మీట్లు పెట్టి అన్నీ చెబుతూ వస్తున్నారు. ఏపీపీఎస్సీలో మొత్తం ఏదో గూడుపుఠాణి సాగుతోందన్న ఆరోపణల నడుమ చైర్మన్ ఉదయభాస్కర్ అఫిడవిట్ ఇప్పుడు కలకలం రేపడం ఖాయంగా కనిపిస్తోంది. హైకోర్టు ఈ అంశం ఇచ్చే తీర్పుపై ఆసక్తి ఏర్పడుతోంది.