గుమ్మడికాయ దొంగ ఎవర్రా అంటే.. నేను కాదు అని భుజాలు తడుముకున్నాడట.. ఎనకటికో తీఫ్. అలాగే ఉంది ఎన్టీఆర్ అభిమాని శ్యామ్ అనే కుర్రాడు అనుమానాస్పద స్థితిలో చనిపోయాడు. మొదట పోలీసులు ఆత్మహత్య అని చెప్పారు. ఎక్కువ మంది నమ్మారు.కానీ ఫోటోలు చూసిన తర్వాత అచ్చం వైఎస్ వివేకా హత్య తరహాలోనే ఆత్మహత్య కాదు.. హత్యేనన్న అనుమానాలు బలపడ్డాయి. అయితే సోషల్ మీడియాలో కొంత మంది ఇది వైసీపీ నేతలపనేనని గాల్లో రాయి వేశారు. అది ఎటుపోయిందో కానీ.. వెదికి మరీ తెచ్చుకుని తమ పార్టీకి కొట్టేసుకున్నారు వైసీపీ సోషల్ మీడియా పెద్దలు.
శ్యామ్ మృతి విషయంలో అనేక అనుమానాలు ఉండంతో.. సహజంగానే అన్నిపార్టీల సినీ హీరోల అభిమానులు.. విచారణ కోసం డిమాండ్ చేయడం ప్రారంభించారు. అప్పటికే వైసీపీ నేతలు డిఫెన్స్ లో పడిపోయారు. తప్పేదో తామే చేసినట్లుగా డిఫెన్సివ్ గా ఉండటంతో .. నెటిజన్లు మరింతగా ఒత్తిడి పెంచారు. టీడీపీ నేతలంతా ఒకరి తర్వాత ఒకరు శ్యామ్ కు న్యాయంచేయాలన్న డిమాండ్ తో సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు.అయితే ఎవరూ ఎక్కడా నేరుగా వైసీపీ నిందించలేదు. వస్తున్న ఆరోపణలపై పోలీసులు దర్యాప్తు చేయాలన్నారు. కానీ అతిగా స్పందించిన వైసీపీ సోషల్ మీడియా వెంటనే.. శ్యామ్ ఆత్మహత్య చేసుకునే ముందు తీసుకున్నారంటూ వీడియోలను బయట పెట్టారు.
వైసీపీ సోషల్ మీడియా ఇంచార్జ్ సజ్జల భార్గవరెడ్డి ఈ వీడియోలను మొదట సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. తర్వాత వైసీపీ నేతలంతా అదే పని చేశారు. దీంతో అప్పటి వరకూ అనుమానంగా చూస్తున్న వారు.. అసలు వైసీపీ సోషల్ మీడియాకు ఈ వీడియోలన్నీ ఎక్కడి నుంచి వచ్చాయన్న అనుమానాలు ప్రారంభమయ్యాయి. ఆ వీడియోలు సెల్ఫీ వీడియోలులా లేవు. ఎవరో బెదిరిస్తే తీసినట్లుగా ఉన్నాయన్న అనుమానాలు కలుగుతూండటంతో వైసీపీ .. ఈ అనుమానాస్పద మృతి కేసును తనకు తాను స్వయంగా అంటించుకున్నట్లు అయింది.
ఈ కేసులో పోలీసులు ఆత్మహత్యగా నిర్దారించి క్లోజ్ చేసే ఆలోచనలో ఉన్నారు. తమ దర్యాప్తుపై శ్యామ్ తల్లిదండ్రులు ఏమీ అభ్యంతరం చెప్పలేదని అంటున్నారు. కానీ తన కుమారుడిది హత్యేనని శ్యామ్ తండ్రి కన్నీరు పెడుతున్నారు. మొత్తంగా ఈ కేసు విషయంలో అసలేం జరిగిందో పోలీసులే వెల్లడించాల్సి ఉంది. కానీ వైసీపీ మాత్రం ముందే మాకేం సంబంధం లేదని బయటకొచ్చి భుజాలు తడిసేముకుంటోంది.