తెరాస-టీడీపీల మధ్య పొత్తు ఉంటుందా… ఇదే అంశంపై రాజకీయ వర్గాల్లో వాడీవేడీ చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా టీ టీడీపీ నేతల మధ్య ఈ అంశం విభేదాలకు దారితీసిన పరిస్థితి కూడా తెలిసిందే. నిజానికి, ఈ చర్చకు మూలకారణం సీఎం కేసీఆరే అయినా, టీడీపీతో పొత్తుకు సంబంధించి తెరాసలో ఎలాంటి చర్చా జరగడం లేదంటూ నాయకులు చెబుతూ ఉండటం విశేషం! పార్టీ అంతర్గత సమావేశాల్లో కూడా ఈ విషయం గురించి ఎవ్వరూ మాట్లాడటం లేదని అంటున్నారు. ఈ మౌనాన్ని అర్ధ అంగీకార సూచకంగా భావించొచ్చేమో! అయితే, పొత్తు విషయమై ఓ కీలక తెరాస నేత టీడీపీతో చర్చ జరిపారనే గుసగుసలు వినిపిస్తున్నాయి. టీడీపీతో దోస్తీ విషయమై ఇద్దరి చంద్రులతో ఆయనే మధ్యవర్తిత్వం చేస్తున్నారనే కథనాలు ఉన్నాయి! ఇంతకీ ఆ కీలక నేత ఎవరంటే.. తుమ్మల నాగేశ్వరరావు. ఆంధ్రా టీడీపీ నేతల్లో తుమ్మలకు సహచరులు ఉన్నారు కాబట్టి, వారి ద్వారా ఆయన రాయబారం నెరపుతున్నారు అనే గుసగుసలు వినిపిస్తున్నాయి.
ఈ కథనాల నేపథ్యంలో తుమ్మల స్పందించిన తీరు ఆసక్తికరంగా ఉంది. పొత్తుల విషయమై తెరాసలో ఎలాంటి చర్చలూ జరగలేదని తుమ్మల చెప్పారు! తెలంగాణలో టీడీపీతో పొత్తు అవసరం ఉందని తాము భావించడం లేదన్నారు. ఒకవేళ పొత్తు ఉండాలా లేదా అనేది పార్టీ నిర్ణయం అవుతుందన్నారు. అంతేకాదు, పార్టీ ఏరకంగా ఆదేశిస్తే.. దానికి అనుగుణంగా పనిచేయాల్సిన బాధ్యత తనపై ఉంటుందని చెప్పారు. ఆంధ్రా టీడీపీ నేతలో తాను మాట్లాడననీ, అది కూడా ప్రాజెక్టులూ అభివృద్ధి కార్యక్రమాల గురించే చర్చించానని అన్నారు. తెలుగు రాష్ట్రాలు భౌగోళికంగా విడిపోయినా, మానసికంగా కలిసిమెలిసి ఉంటూ రెండు రాష్ట్రాలూ ఎదగాలన్న దృక్పథంతోనే అక్కడి నేతలతో టచ్ ఉంటున్నానని తుమ్మల చెప్పారు. అంతేగానీ, రాజకీయ ప్రయోజనాల కోసం మాట్లాడటం లేదన్నారు! ఒకవేళ పొత్తుల విషయమై పార్టీ ఆదేశిస్తే ఏపీ టీడీపీతో చర్చించేందుకు సిద్ధం అని తుమ్మల చెప్పడం విశేషం!
పొత్తుపై జరుగుతున్న ప్రచారంలో ఏమాత్రం వాస్తవాలు లేవని ఖండిస్తున్నారు. ఇదే తరుణంలో భవిష్యత్తులో పొత్తు ఉండదని కూడా ఢంకాపథంగా చెప్పలేకపోతున్నారు! పార్టీ ఆదేశిస్తే టీడీపీతో చర్చలకు సిద్ధమని కూడా తుమ్మల నాగేశ్వరరావు అభిప్రాయపడటం గమనార్హం! ఒకటి మాత్రం నిజం… టీడీపీతో పొత్తు ఉన్నా లేకపోయినా, ఆ పార్టీతో ఒక ప్రత్యేకమైన స్నేహం మొదలైందనే సంకేతాలు తెరాస నేతలు ఇస్తున్నారు. కేసీఆర్ ప్రస్తుత లక్ష్యం కూడా ఇదే కదా! రాష్ట్రంలో ఒక సామాజిక వర్గాన్ని ఆకర్షించాలనే ఉద్దేశంతోనే ఈ టాపిక్ తెరమీదికి ఆయనే తెచ్చారు. ఒకవేళ టీడీపీతో పొత్తు వద్దు అనేది పార్టీ నిశ్చిత నిర్ణయమే అయితే.. దాని గురించి అస్సలు మాట్లాడకూడదు! అప్రస్తుతం అని ఆగిపోవాలి. పార్టీ ఆదేశిస్తే చేస్తానూ చూస్తామూ అనే అభిప్రాయాలకే అవకాశం ఉండకూడదు కదా!