గుడివాడలో మట్టి మాఫియా చేతిలో దాడికి గురైన రెవిన్యూ ఇన్స్పెక్టర్ అరవింద్‌పై పోలీసులు కేసులు నమోదు చేశారు.ఆర్ఐ, రెవెన్యూ సిబ్బంది లంచం డిమాండ్ చేస్తూ.. తమపై దాడికి దిగారని మట్టి మాఫియా పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆర్ఐ అరవింద్‌పై సెక్షన్ 323, 506, 384, రెడ్ విత్ 511 కింద కేసులు నమోదు చేశారు. దాడి ఘటన జరిగిన నాలుగు రోజుల తర్వాత ఇలా బాధితుడైన ఆర్ఐపైనే ఎదురు కేసులు నమోదు చేయడం కలకలం రేపుతోంది.
ఐదు రోజుల కిందట గుడివాడ మండలం, మోటూరు గ్రామంలో జరుగుతున్న అక్రమ తవ్వకాలను అడ్డుకున్న రెవెన్యూ అధికారులపై మైనింగ్ మాఫియా దాడికి తెగబడింది. రెవెన్యూ అధికారిని జేసీబీతో తొక్కించేందుకు యత్నించింది. మాదీ మంత్రి కొడాలి నాని ముఖ్య అనుచరునిగా భావిస్తున్న గంటా సురేష్ ఆధ్వర్యంలో ఈ దాడి జరిగినట్లుగా ఆరోపణలు వచ్చాయి. దాడిలో సురేష్ సోదరుడు కల్యాణ్ పాల్గొన్న దృశ్యాలున్నాయి. ఆర్ఐపై జేసీబీతో తొక్కించేందుకు ప్రయత్నించారు. వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ కేసులో కీలక నిందితుడిగా ఉన్న గంటా సురేష్‌ను ఇప్పటి వరకూ అరెస్ట్ చేయలేదు.
ఈ లోపు మట్టి మాఫియానే ఎదురు ఫిర్యాదు చేయడంతో ఆర్ఐపై కేసు నమోదు చేయడంపై ఉద్యోగుల్లోనూ విస్మయం వ్యక్తమవుతోంది. ఎలాంటి ఆధారాల్లేకుండా తమపై ఫిర్యాదు చేస్తే కేసులు పెట్టడం ఏమిటని ఉద్యోగులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అయితే కేసు ఉపసంహరణకు ఆర్ఐ ఆనంద్ నిరాకరించడంతోనే .. మట్టి మాఫియా ఎదురు కేసుసు పెట్టిందన్న ప్రచారం గుడివాడలో జరుగుతోంది. గతంలో కేసినోను నిర్వహిస్తే ఒక్కపోలీసూ అడ్డుకోలేదు. కనీసం రిపోర్టు కూడా ఇవ్వలేదు. చివరికి మట్టి మాఫియా ఉద్యోగిపై దాడికి పాల్పడినా.. రివర్స్ కేసులతో సెటిల్మెంట్ చేసే ప్రయత్నం జరుగుతోందన్న ఆరోపణలు వినపిస్తున్నాయి.