అమ్మాయి తల్లిదండ్రులు తమ బిడ్డపై పోలీస్ కానిస్టేబుల్ అత్యాచార యత్నం చేశారని కేసు పెట్టడం నిజం. ప్రాథమిక దర్యాప్తు నిర్వహించి ఆ కానిస్టేబుల్‌ను ఎస్పీ సస్పెండ్ చేయడం కూడా నిజం. దీనిపై నారా లోకేష్ రక్షక భటులే..భక్షక భటులైతే ఎలా అని ట్వీట్ పెట్టడం కూడా నిజం. అయితే గుంటూరు అర్బన్ ఎస్పీకి..పోలీసు అధికాలు సంఘానికి లోకేష్ పెట్టిన ట్వీట్ మాత్రమే తప్పుగా అనిపించింది. లోకేష్ పెట్టిన ట్వీట్‌ను తప్పు అని చెప్పడానికి తీవ్రమైన నేరం చేసిన తమ పోలీసును వెనుకేసుకురావడానికి కూడా ఎస్పీ సహా పోలీసు అధికారుల సంఘం వెనుకాడకపోవడం ఇప్పుడు చర్చనీయాంశం అవుతోంది.
గుంటూరులో కానిస్టేబుల్‌ను సస్పెండ్ చేసిన విషయాన్ని అర్బన్ ఎస్పీ అధికారికంగా ప్రకటించారు. ఊరకనే ఎందుకు సస్పెండ్ చేస్తారు. ఆ కానిస్టేబుల్ తన ఇంటి పక్కన ఉండే అమ్మాయితో మాట్లాడుతున్నారట. ఆ మాటలు ఎక్కువైపోయాయట. తమ అమ్మాయితో మాట్లాడవద్దని ఆ తల్లిదండ్రులు కానిస్టేబుల్‌కు చెప్పినా వినిపించుకోలేదట. అందుకే ఆ తల్లిదండ్రులు కేసు పెడితే ఎస్పీ కానిస్టేబుల్‌ను సస్పెండ్ చేశారట. అదే నిజం అయితే ఆ కానిస్టేబుల్ చేసింది తప్పు కాకపోతే సస్పెండ్ చేయడం ద్వారా అతని జీవితాన్ని రిస్క్‌లో పెట్టింది ఎవరు .. గుంటూరు ఎస్పీ కాదా ఆన్న ప్రశ్న సహజంగానే వస్తుంది. సరైన విచారణ లేకుండా ఆ చర్య తీసుకుని ఉంటే ఎస్పీనే బాధ్యత వహించాల్సి ఉంటుంది.
ఓ వైపు కారణం ఇలా కనిపిస్తూండగా మరో వైపు పోలీసు అధికారుల సంఘాన్ని కూడా తెరపైకి తీసుకు వచ్చారు. లోకేష్‌కు ఎవరో తప్పుడు సలహాలిస్తున్నారని .. పోలీసుల స్థైర్యాన్ని దెబ్బతీస్తున్నారని వారు చెప్పుకొచ్చారు. వారు కూడా ఆ కానిస్టేబుల్‌కు మద్దతుగా మాట్లాడారు. తప్పు చేశాడని చర్యలు తీసుకుంది వారే.. ఇప్పుడు మద్దతుగా మాట్లాడుతోంది వారే. ఇలాంటి చర్యల వల్లే పోలీసుల్లో ప్రజలకు చిన్న చూపు ఏర్పడుతోందన్న మాట చాలా కాలంగా వినిపిస్తోంది. నిజంగా ఆ కానిస్టేబుల్ తప్పు చేయకపోతే ఎందుకు శిక్షించారు..? తప్పు చేస్తే ఆ విషయం చెప్పిన లోకేష్‌పై ఎందుకు విరుచుకుపడుతున్నారు..? అని టీడీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు.
ఈ అంశంలో అత్యుత్సాహానికి పోయి గుంటూరు ఎస్పీ కానిస్టేబుల్‌ను సస్పెండ్ చేసి ఆ విషయం మీడియాకు లీక్ చేయడంతోనే ఈ సమస్య అంతా ఉత్పన్నమయిందని అంటున్నారు. నిజాలేమిటో తెలుసుకోకుండా సొంత డిపార్టుమెంట్‌లోని వ్యక్తిపై చర్యలు తీసుకుని ఇప్పుడు.. ఇతరులు నిందతులు వేస్తున్నారని ఆక్షేపించడంపై పోలీసులపైనే విమర్శలు వస్తున్నాయి.