క్రికెట్లో స్లెడ్జింగ్‌ను ఆస్ట్రేలియా ఆటగాళ్లు తీసుకు వస్తే.. ఇప్పుడు జాత్యాహంకారాన్ని ప్రేక్షకులు తీసుకు వస్తున్నారు. సిడ్నీలో ఆస్ట్రేలియా ఫ్యాన్స్ భారత ఆటగాళ్లపై రోజూ… రేసిజం వికృతాన్ని ప్రదర్శిస్తున్నారు. క్రికెటర్లను మానసికంగా ఇబ్బంది పెట్టకపోతే.. ఎక్కడ ఆస్ట్రేలియా ఓడిపోతుందని అనుకున్నారో కానీ… రోజూ.. భారత క్రికెటర్లపై జాత్యాహంకార వ్యాఖ్యలు చేస్తున్నారు. సిడ్నీలో జరుగుతున్న మూడో టెస్టులో బాగా తాగి వచ్చిన ఆస్ట్రేలియా అభిమానులు మరోసారి అతిగా ప్రవర్తించారు. రెండు, మూడో రోజు ఆట సమయంలో టీమిండియా బౌలర్ల బుమ్రా, మహ్మద్ సిరాజ్‌పై జాత్యంహకార వ్యాఖ్యలు చేశారు. వివాదమైనా.. ప్రపంచవ్యాప్తంగా మీడియాలో హైలెట్ అయి.. ఆస్ట్రేలియా పరువు పోయేటట్లు చేసినా తాగుబోతులు వెనక్కి తగ్గలేదు. నాలుగో రోజు ఆటలో కూడా మరోసారి నోరు పారేసుకున్నారు.
సిరాజ్ తన ఫీల్డింగ్ పొజిషన్ అయిన బౌండరీలైన్ వద్ద నిలబడిన సమయంలో స్టాండ్స్‌లో ఉన్న ఆస్ట్రేలియా అభిమానులు సిరాజ్‌పై జాత్యాహంకార వ్యాఖ్యలు కొనసాగించారు. అవి శృతి మించడంతో సిరాజ్.. వెళ్లి కెప్టెన్ అజింక్య రహానేకు ఫిర్యాదు చేశాడు. ఆ తర్వాత ఇద్దరూ కలిసి అంపైర్ పాల్ రీఫిల్‌కు ఫిర్యాదు చేశారు. అంపైర్ వెంటనే… చర్యలు తీసుకున్నారు. పోలీసులు, మైదానం సిబ్బంది సాయంతో జాత్యాహంకార వ్యాఖ్యలు చేసిన ఆరుగుర్ని గుర్తించి బయటకు పంపేసారు. ఈ కారణంగా కాసేపు ఆటను నిలిపివేయాల్సి వచ్చింది.
ఆస్ట్రేలియాలో ఇండియన్ క్రికెటర్లపై జరుగుతున్న జాత్యాహంకార దాడులపై క్రికెట్ ఆస్ట్రేలియా టీమిండియాకు క్షమాపణలు చెప్పింది. ఆస్ట్రేలియాలో… స్టేడియంలో మద్యం తాగడానికి పర్మిషన్ ఉంది. సిడ్నీ స్టేడియంలో.. ప్రేక్షకులు ఆటను అస్వాదిస్తూ.. మద్యం సేవించవచ్చు. ఇలా స్టాండ్స్‌లో మద్యం సేవించేవారు తరచూ ఆటగాళ్లను ఇబ్బంది పెడుతున్నారు. 2007లో భారత జట్టు ఆస్ట్రేలియా పర్యటించినప్పుడు ఆండ్రూ సైమండ్స్‌పై హర్భజన్ సింగ్ జాత్యాహంకార వ్యాఖ్యలు చేశారని ఆరోపణలు వచ్చాయి. ఆ వివాదాన్ని మంకీగేట్ పిలుస్తూ ఉంటారు. అది గుర్తు పెట్టుకుని ఇప్పుడు ప్రతీకారంగా కొంత మంది కావాలనే ఇప్పుడు అలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ వివాదంపై క్రికెట్ ఆస్ట్రేలియా .. టీమిండియాకు క్షమాపణలు చెప్పింది.