టిఆర్ఎస్ ఎంఎల్ఎలకు సంబందించిన వివాదాలు అనేకం తీవ్ర రూపం తీసుకుంటున్నాయి. ప్రభుత్వంపై ముఖ్యమంత్రి కెసిఆర్‌కు తిరుగులేని పట్టు వుందని చెప్పుకుంటున్నా అమాత్యులతో సహా పార్టీ ప్రజా ప్రతినిధుల వివాదాలు రచ్చకెక్కుతున్నాయి. తాజాగా జనగమా ఎంఎల్ఎ ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి చెరువు శిఖం కబ్జా ఆరోపణల వివాదం ముదిరింది. తాను కబ్బా చేసినట్టు కలెక్టర్ దేవసేన చేసిన ఆభియోగం అసత్యమని ఆమెను వెంటనే బదిలీ చేయాలని ముత్యం రెడ్డి వత్తిడి చేస్తున్నారు. ముఖ్యమంత్రిని కలిసి తన వాదనలు వినిపించారు. మొదట వివరాలను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి అందజేసి తర్వాత ముఖ్యమంత్రి పిఆర్వోకు కూడా ఇచ్చారు. అధినేత సలహా మేరకే ముత్యం రెడ్డి మీడియాతో మాట్లాడారట. అయితే ఆయన తనను సమర్థించుకోవడమే గాక కలెక్టర్‌పై ఎదురుదాడి చేశారు. వరంగల్ అర్బన్ జిల్లా కలెక్టర్ ఆమ్రపాలిపైన అక్కడి ఎంఎల్ఎ ఇదే విధమైన ఆరోపణ చేశారు గనక వీరిని పరస్పర బదిలీలు చేయొచ్చని ఒక కథనం. అంతకు ముందు మహబూబ్‌నగర్ ఎంఎల్ఎ ప్రీతీమీనాతో ఎంఎల్ఎ శంకర్ నాయక్ అనచితంగా ప్రవర్తించినా ఎలాటి చర్య లేకపోయింది. కలెక్టర్ దేవసేన సమర్థంగా పనిచేస్తూ ప్రజల అభిమానం పొందిన నేపథ్యంలో ఆమెపై చర్య తీసుకుంటే బాగా వ్యతిరేకత వస్తుందంటున్నారు. ఆమె ఎంఎల్ఎ అక్రమాలను బయిటపెట్టడాన్ని ప్రతిపక్షాలు స్వాగతించాయి. ఇదే విధంగా ఎంఎల్ఎలు గాదారి కిశోర్, వేముల వీరేశం, శంకర గౌడ్ వంటివారిపైనా ఆరోపణలున్నాయి. కరీం నగర్ ఎంఎల్ఎ గంగుల కమలాకర్‌పై ఆ పార్టీ కార్పొరేటర్ చొప్పరి జయశ్రీనే ఆరోపణలు గుప్పించారు. తాండూరులోనూ మంత్రి మహేందర్‌రెడ్డిపై ఆరోపణలతో టిఆర్ఎస్ కార్యకర్త ఒకరు ఆత్మహత్య చేసుకున్నారు. రసమయి బాలకిషన్ న్యాయం చేయలేదంటూ దళిత యువకులొకరు ఆత్మహత్య చేసుకున్నారు.ఇవేగాక ఇంకా చాలామందిపై ఆరోపణలు బహిరంగంగా వచ్చినా రచ్చ జరిగినా కఠినంగా వ్యవహరించగల స్తితిలో టిఆర్ఎస్ నాయకత్వం లేదు. సిట్టింగ్‌లందరికీ టికెట్టు వస్తాయని కెసిఆర్ ఇప్పటికే ప్రకటించారు. లేదంటే వారు మరోపార్టీలోకి దూకేసి టికెట్ కోసం ప్రయత్నిస్తారనే ఆందోళన నాయకత్వానికి వుంది.