హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి శంకుస్థాపన ఈవెంట్‌ను ముంబాయికి చెందిన ‘విజ్‌క్రాఫ్ట్’ సంస్థకు ఇచ్చారన్న వార్తలపై వివాదం రాజుకుంది. తుళ్ళూరు మండలం వెంకటపాలెం సమీపంలో సుమారు 50 ఎకరాల స్థలంలో రానున్న విజయదశమికి జరగనున్న ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా నిర్వహించబోతున్న సంగతి తెలిసిందే. దేశప్రధాని నరేంద్రమోడితోబాటు సింగపూర్ ప్రధాని లీ సీన్ లూంగ్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనబోతున్నారు. ఈ నేపథ్యంలో ఈ కార్యక్రమ నిర్వహణను అంతర్జాతీయస్థాయిలో నిర్వహించాలని, నిర్వహణను ఈవెంట్ మేనేజిమెంట్ సంస్థకు అప్పగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనికోసం ఈనెల 16న సీఆర్డీఏ సంస్థ ఈ-టెండర్లు ఆహ్వానించింది. ఈ ఈవెంట్‌ను రు.9.5 కోట్లకు విజ్‌క్రాఫ్ట్ సంస్థ దక్కించకుందని ఇవాళ ఒక ప్రముఖ తెలుగు దినపత్రికలో ఓ కథనం వచ్చింది. ఆ సంస్థకు టెండర్ ఇవ్వటం ఏకపక్షంగా సాగిందని ఆ కథనంలో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో పురపాలకశాఖమంత్రి నారాయణ ఇవాళ మధ్యాహ్నం దీనిపై ఒక వివరణ ఇచ్చారు. ఇంతవరకు ఏ సంస్థకూ ఆ బాధ్యతలు అప్పగించలేదని విజ్‌క్రాఫ్ట్ పేరు పరిశీలనలోమాత్రమే ఉందని మీడియాతో చెప్పారు. అయితే ఈ మొత్తం వ్యవహారం పారదర్శకంగా జరగటంలేదన్నదిమాత్రం వాస్తవం. వ్యవహారం మొత్తం పారదర్శకంగా నడపటంకోసమే ఈ-టెండర్లను పిలుస్తారు. కానీ ఇక్కడ అంతా తిరకాసుగానే కనిపిస్తోంది. దానికితోడు దీనిపై తెలుగుదేశానికి అనుకూలంగా ఉండే దినపత్రికలో కథనంరావటం మరింత విచిత్రంగా ఉంది. ఒకవేళ ఆ పత్రికకు చెందిన ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీకి కాంట్రాక్ట్ ఇవ్వకపోవటంవల్ల ఈ కథనం వెలువడిందా అన్న వాదనకూడా వినబడుతోంది.