సాధ్యమైనంత వరకూ వివాదాలకు దూరంగా ఉంటాలనుకుంటారు చిరంజీవి. అజాత శత్రువు అని, అందరివాడని పిలిపించుకోవాలని తపన. అయితే అప్పుడప్పుడూ చిరుకి ఝలక్కులు తగులుతూనే ఉంటాయి. అనుకోని వివాదాలు పలకరిస్తూనే ఉంటాయి. ప్రస్తుతం బాలయ్య కామెంట్లు, ఆ తరవాత నాగబాబు స్పందనలూ.. చిరంజీవికి కొత్త తలనొప్పుల్ని తీసుకొచ్చాయి.
దాసరి లేకపోవడంతో చిత్రసీమకు పెద్ద దిక్కు లేకుండా పోయింది. ఆ స్థానంలో చిరు రావాలని చాలామంది కోరిక. అది నెరవేరింది కూడా. ఈమధ్య సీసీసీ ఏర్పాటు చేసే విషయంలోనూ, చిత్రసీమ సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడంలోనూ చిరు `గ్యాంగ్ లీడర్` బాధ్యతల్ని నిర్వర్తించారు. ఆయన యాక్టీవ్‌గా ముందుకు రావడంతో పరిశ్రమకూ.. ఓ పెద్ద తోడు దొరికినట్టైంది. లాక్ డౌన్ వల్ల చిత్రసీమ స్థంభించిపోంది. తిరిగి కార్యకలాపాలు సాగించుకోవడానికి అనుమతుల కోసం ప్రభుత్వంతో విరివిగా సంప్రదింపులు జరుగుతోంది చిత్రసీమ. ఆ బృందంలో అగ్ర కథానాయకుడు బాలకృష్ణ లేకపోవడం చాలామందిని విస్మయ పరిచింది. చివరకు బాలయ్య కూడా నన్నెవ్వరూ పిలవలేదు… అని చెప్పడం మరింత షాకింగ్‌గా అనిపించింది.
బాలయ్య ఎలాంటి వ్యాఖ్యలు చేశారన్న సంగతి పక్కన పెడితే – అసలు బాలయ్యని పిలవకపోవడం తప్పు. బాలయ్య వస్తాడా, రాడా? అనే సందేహాలు పక్కన పెట్టి, కనీసం కర్టెసీకి అయినా – పిలవాల్సింది. దాంతో.. మొదటి తప్పు చిరు క్యాంప్ది అయ్యింది. దానికి తోడు నాగబాబు వీరావేశంతో రెచ్చిపోవడం నిజంగా చిరుని ఇబ్బంది పెట్టేదే. ఎందుకంటే ఎంతకాదన్నా నాగబాబు మెగా బ్రదర్. తన అన్నని వెనకేసుకురావడానికి నాగబాబు చేసిన ప్రయత్నం అదన్న సంగతి అందరికీ అర్థమవుతూనే ఉంది. ఇప్పుడు చిరు చెప్పాల్సిన జవాబులు రెండున్నాయి. ఒకటి.. బాలయ్యని ఎందుకు పిలవలేదూ.. అన్నది. రెండోది `భూములు పంచుకున్నారు` అనే ఆరోపణకి వివరణ. అయితే… ఇలాంటి విషయాలు ఎంత కెలుక్కుంటే అంత తలనొప్పి. మరి ఈ సమస్య నుంచి చిరు ఎలా దాటుకొస్తాడో చూడాలి.