హైదరాబాద్: కేంద్ర మాజీ మంత్రి, పుదుచ్చేరి ఎంపీ, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు వి.నారాయణస్వామి రాహుల్ గాంధి నిన్న పుదుచ్చేరిలో వరద ప్రాంతాలలో పర్యటించిన సందర్భంగా ఆయన చెప్పులు మోశారంటూ కొత్త వివాదం రేగింది. వాస్తవానికి జరిగిందేమిటంటే రాహుల్ నిన్న వరద ప్రాంతాలలోకి వెళ్ళగానే అక్కడ నీళ్ళు, బురద ఉండటంతో షూస్ విప్పారు. ఈ పరిస్థితిని ముందే ఊహించిన నారాయణస్వామి, చెప్పుల జతనొకదానిని సిద్ధంగా పెట్టుకుని రాహుల్ షూస్ విప్పగానే ఆయనకు చెప్పులు అందించారు. రాహుల్ వాటిని వేసుకున్నారు. ఈ వీడియో వెలుగులోకి రావటంతో సోషల్ మీడియాలో ఒక్కసారిగా విమర్శలు వెల్లువెత్తాయి. కాంగ్రెస్ పార్టీలో వ్యక్తిపూజకు ఇది నిదర్శనమంటూ పలువురు ధ్వజమెత్తారు.
నారాయణస్వామి దీనిపై వివరణ ఇస్తూ, వరదనీళ్ళలో రాహుల్ ఒట్టి కాళ్ళతో నడిస్తే బాగుండదని భావించి మర్యాదపూర్వకంగా ఆయనకు చెప్పులను ఇచ్చానని చెప్పారు. వరద ప్రాంతాల్లో సందర్శించే సందర్భంగా రాహుల్ తన షూస్‌ను తానే చేతుల్లో పట్టుకున్నారని, భద్రతా సిబ్బందికి ఇచ్చేందుకు కూడా ఒప్పుకోలేదని అన్నారు. నారాయణ స్వామి యూపీఏ ప్రభుత్వంలో పార్లమెంటరీ వ్యవహారాల శాఖమంత్రిగా పనిచేశారు.