హైదరాబాద్ ప్రజలకు ఇప్పటికీ రోజూ ప్రత్యక్ష నరకం తప్పడం లేదు. కనీసం గుంతలు పూడ్చించలేని ప్రభుత్వ నిర్వాకం, పూడ్చలేని జీహెచ్ ఎంసి వారి పనితనం వల్ల ఈ రోడ్లపై ప్రయాణం నరకంగా మారింది. మరోవైపు, పూడ్చని గుంగలకు, వెయ్యని రోడ్లకు కూడా కొందరు కాంట్రాక్టర్లు బిల్లులు చెల్లించాలంటూ క్లెయిం చేశారట. ఈ వ్యవహారంపై చీఫ్ సెక్రటరీ రాజీవ్ శర్మ మండిపడ్డారని సమాచారం. బిల్లుల చెల్లింపుతో సహా పూర్తి వివరాలు పంపాలని శనివారం సాయంత్రం ఆదేశించారని తెలుస్తోంది.
హైదరాబాద్ లో ఏవో కొన్ని ప్రధాన రోడ్లలో పైపైన గుంతలు పూడ్చారు. పంజాగుట్ట ఫ్లై ఓవర్ పైనా నామ్ కే వాస్తే ఒక లేయర్ వేశామని అనిపించారు. అప్పుడే మళ్లీ దానిపై గుంతలు పడ్డాయి. నగరంలో 90 శాతం పైగా రోడ్లపై గుంతలు పూడ్చనే లేదు. ముఖ్యమంత్రి ఈ చిన్న విషయం పట్టించుకుంటారా అంటారేమో. ఆయన తనయుడు, మున్సిపల్ మంత్రి కేటీఆర్ అయినా పట్టించుకోవాలి. కానీ ఆయన అమెరికా పర్యటనలో ఉన్నారు.
తెరాస ప్రభుత్వంలో మంత్రులున్నా ప్రజల సమస్యలను పట్టించుకునే వారెందరు అంటే చెప్పడం కష్టం. కాబట్టి నగరంలో రోడ్ల మరమ్మతు దైవాధీనం సర్వీసులా మారింది. సందట్లో సడేమియా అన్నట్టు, కొందరు కాంట్రాక్టర్లు మాస్టర్ ప్లాన్ వేశారట. తట్టెడ్ మట్టి కూడా పొయ్యని రోడ్లను కూడా తామే రిపేరు చేశామని బిల్లులు పెట్టారట. ఇలా దాదాపు 100 కోట్ల రూపాయల దాకా స్కామ్ జరిగిందని ఆంధ్ర జ్యోతి పత్రిక కథనం ప్రచురించింది. పని జరగకుండా క్లెయిం చేసిన ప్రాంతాల వివరాలను కూడా వెల్లడించింది. దీని ఆధారంగా వెంటనే తగిన చర్యలు తీసుకోవాలి. కానీ జీహెచ్ ఎం సిలో మాత్రం చలనం లేదు. పైగా దబాయింపు సెక్షన్ ఉండనే ఉంది.
దీంతో చీఫ్ సెక్రటరీ జోక్యం చేసుకున్నారని సమాచారం. ఇలాంటి వ్యవహారంలో కేసీఆర్ ప్రభుత్వం స్పందించిన సందర్భాలుచాలా అరుదు. మరి వాళ్లు చాలా బిజీగా ఉంటారేమో. చివరకు 100 కోట్ల చెల్లింపులు జరిగిపోతాయో లేక చీఫ్ సెక్రటరీ జోక్యం తో అయినా అది ఆగిపోతుందో చూడాలి. ఇంతకీ తప్పుడు బిల్లులు పెట్టిన వాళ్లకు శిక్ష ఏదీ ఉండదా? బంగారు తెలంగాణ సాధించే కేసీఆర్ సర్కారే జవాబు చెప్పాలి.