ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జగనన్న విద్యా కానుక పేరుతో స్కూల్ పిల్లలకు పంచిన బ్యాగులు, బెల్టులు, పుస్తకాల విషయం ఇప్పుడు రాజకీయ దుమారానికి కారణం అవుతోంది. అవి కేంద్ర ప్రభుత్వ నిధులతో ఇచ్చిన కానుకలంటూ బీజేపీ నేతలు రెండు రోజుల నుంచి విమర్శలు చేస్తున్నారు. విష్ణువర్ధన్ రెడ్డి లాంటి నేతలు… స్టిక్కర్ సీఎంగా జగన్ పేరు సార్థకం చేసుకున్నారని విమర్శలు గుప్పించారు. అయితే.. వైసీపీతో ఫ్రెండ్లీ మ్యాచ్ ఆడుతున్నారన్న ట్యాగ్ వల్లేమో కానీ.. వారి విమర్శలకు పెద్దగా స్పందన కనిపించడం లేదు. దీంతో బీజేపీ మిత్రపక్షం పవన్ కల్యాణ్ కూడా రంగంలో దిగారు. విద్యాకానుక పథకం అమలులో కేంద్రం నిధులు అరవై శాతం ఉన్నాయని లెక్కలు విడుదల చేశారు.
విద్యార్థుల యూనిఫాంలు, పాఠ్య పుస్తకాలు, స్కూల్ బ్యాగులకు తదితరాలకు అయ్యే ఖర్చులో కేంద్రం 60 శాతం నిధులు ఇస్తోందని.. లెక్కలు ట్వీట్ చేశారు. అలాగే కేంద్రం, రాష్ట్రం దేనికెంతెంత ఖర్చు చేస్తోందో సంబంధిత వివరాలనూ వెల్లడించారు. తెలుగుదేశం పార్టీ నేతలు ఆ పథకం గతంలో ఉన్నదేనని.. వివరాలు బయట పెడతున్నారు. ఓ బ్యాగ్ ఇచ్చి..అన్నింటిపై స్టిక్కర్లు వేసుకున్నారని… కానీ గత ప్రభుత్వంలో అమలు చేసిన ఎన్నో పేద విద్యార్థులకు ఉపయోగపడే పథకాలను నిలిపివేశారని బయట పెట్టారు. అయితే.. ప్రభుత్వం మాత్రం.. విద్యా కానుక పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ నిధులతో ఇస్తున్నదేనని… కేంద్రం ఒక్క పైసా ఇవ్వడం లేదని వాదిస్తోంది.
విద్యామంత్రి ఆదిమూలపు సురేష్ ఈ అంశంపై విపక్ష నేతలకు సవాల్ చేశారు. కేంద్రం నిధులు ఎక్కడ ఇచ్చిందో చూపించాలని డిమాండ్ చేశారు. దేశంలో ఎక్కడైనా ఇలాంటి పథకం ఉందా అని ప్రశ్నిస్తున్నారు. అసలు ఈ పథకం వల్ల విద్యార్థులకు ఎంత లాభమో కానీ.. రాజకీయ పార్టీలు మాత్రం.. క్రెడిట్ కోసం… రాజకీయం ప్రారంభించేశాయి.