ఆంధ్రప్రదేశ్ లో జనసేన కార్యాలయం నిర్మించేందుకు అనువైన స్థలాన్ని ఇటీవలే గుర్తించిన సంగతి తెలిసిందే. గుంటూరు జిల్లా, మంగళగిరి మండలంలోని చినకాకానిలో ఓ మూడు ఎకరాల భూమిని జనసేన లీజుకు తీసుకుంది. దీనికి సంబంధించి యార్లగడ్డ సాంబశివరావుతో పవన్ కల్యాణ్ మూడేళ్ల లీజు అగ్రిమెంట్ చేసుకున్నారు. అయితే, ఇప్పుడా స్థలం వివాదంలో చిక్కుకుంది. ఆ స్థలం తమది అంటూ ఓ ముస్లిం కుటుంబం మీడియా ముందుకు వచ్చింది. స్థలం తమదైతే, పవన్ కల్యాణ్ వేరేవాళ్లతో ఎలా లీజు అగ్రిమెంట్ చేసుకున్నారంటూ వారు ఆరోపిస్తున్నారు. ఇది తమను మోసం చేయడమే అవుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
జనసేన కార్యాలయ ప్రతిపాదిత స్థలంతోపాటు, అదే సర్వే నంబర్లో మొత్తంగా ఉన్న పది ఎకరాల భూమీ 1920 నుంచి తమ అధీనంలో ఉంది అంటూ ముగ్దుం మొహినిద్దీన్, జక్రియా వారసులు అంటున్నారు. ఈ స్థలానికి సంబంధించిన వివాదం 1981 నుంచి కోర్టులో ఉందని చెబుతున్నారు. 1997లో గుంటూరు కోర్టు తమకు అనుకూలంగా తీర్పు ఇచ్చిందనీ, ఆ తరువాత యార్లగడ్డ సుబ్బారావు హైకోర్టును ఆశ్రయించారనీ, దాంతో ఈ స్థలంపై కోర్టు స్టేటస్ కో ఇచ్చిందని చెబుతున్నారు. ఇలా వివాదం ఉన్న స్థలాన్ని యార్లగడ్డ సాంబశివరావు, పవన్ కి లీజుకు ఎలా ఇస్తారంటూ ఆ కుటుంబం ప్రశ్నిస్తోంది. తాము పేద కుటుంబానికి చెందినవారమనీ, వివాదంలో ఉన్న తమ స్థలంలో ఎలాంటి నిర్మాణాలూ చేపట్టొద్దు అంటూ పవన్ కల్యాణ్ ను ఆ కుటుంబం కోరింది. అంతేకాదు, దీనిపై ఓ కమిటీ వేసి.. స్థలం ఎవరిది అనేది పవన్ తేల్చాలని కూడా ముస్లిం కుటుంబం తరఫున న్యాయవాది కోరుతున్నారు.
ఈ వివాదంపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ వెంటనే స్పందించారు. తన ట్విట్టర్ ద్వారా వివరణ ఇచ్చారు. పార్టీ కార్యాలయ స్థలానికి సంబంధించిన వివాదం తన దృష్టికి వచ్చిందని పవన్ అన్నారు. అయితే, తాను ఈ నెల 8, 9 తేదీల్లో విజయవాడలోనే ఉన్నాననీ, ఆ సమయంలోనే దీన్ని తన దృష్టికి తీసుకొచ్చి ఉంటే బాగుండేదని పవన్ పేర్కొన్నారు. ఆ స్థలం సందర్శనకు తాను స్వయంగా వెళ్లినప్పుడైనా ఎవ్వరూ మాట్లాడలేదన్నారు. ఈరోజున ఒక రాజకీయవేత్త సమక్షంలో ఈ ఇష్యూని బయటపెట్టడం, తనను అవమానించినట్టు ఉందని పవన్ అభిప్రాయపడ్డారు. ఇందులో ఏదైనా రాజకీయ కుట్ర కోణం ఉంటే, జనసేన ధీటుగా ఎదుర్కొంటుందని జనసేనాని చెప్పడం విశేషం. జనసేన తరఫున న్యాయ నిపుణుల బృందం వస్తుందనీ, స్థలం ఆ కుటుంబానిది అని నిర్ధారణ అయిన వెంటనే ఆ స్థలానికి దూరంగా ఉంటామని పవన్ హామీ ఇచ్చారు. అయితే, ఈ వ్యవహారంలో రాజకీయ కోణం ఉందేమో అనే అనుమానాలను పవన్ వ్యక్తం చేయడం విశేషం. మరి, నిజంగానే అలాంటి కోణం ఏదైనా ఉందే లేదా అనేది త్వరలోనే బయటకి వస్తుంది కదా!