వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శాసనసభాపక్షానికి ఉప నాయకుడు జ్యోతుల నెహ్రూ, ఆ పార్టీలోని మరికొందరు ఎమ్మెల్యేలతో కలిసి తెలుగుదేశం పార్టీలో చేరబోతున్న సంగతి ఖరారైపోయింది. ఇక ముహూర్తం ప్రకటించి కండువా కప్పుకోవడం ఒక్కటే తరువాయి. అయితే జ్యోతుల నెహ్రూ తెలుగుదేశం పార్టీకి పాత నాయకుడే గనుక.. ఆయన సీనియర్ గనుక ఆయనకు తప్పకుండా మంత్రి పదవి లభిస్తుందనే ప్రచారం కూడా పార్టీలో ముమ్మరంగా జరుగుతోంది. జ్యోతుల నెహ్రూ తెలుగుదేశాన్ని వీడకుండా ఉండి ఉంటే గనుక… ఆయనే ఉప ముఖ్యమంత్రి అయి ఉండేవారని కూడా ఒక ప్రచారం మొదలైంది.
నిజానికి ఒకే సామాజిక వర్గానికి చెందిన వారు కావడం వలన జ్యోతుల నెహ్రూ ఉప ముఖ్యమంత్రి కాగల స్థాయి నాయకుడు అనడం అంటే… పరోక్షంగా చినరాజప్ప పదవికి చెక్ పెట్టినట్టు లెక్క. తెదేపాలో చాలా మంది నాయకులు ఆ ప్రచారాన్ని తెరమీదకు తెచ్చారు. పైగా చాలా కారణాల నేపథ్యంలో చినరాజప్పకు ఈసారి మంత్రి వర్గ విస్తరణలో ఉద్వాసన తప్పదనే ప్రచారం ముమ్మరంగా జరుగుతోంది. అలాంటి ప్రచారానికి కౌంటర్ అన్నట్లుగా చినరాజప్ప ఈ డైలాగులు వల్లించారా అని రాజకీయ వర్గాల్లో నాయకులు చర్చించుకుంటున్నారు.
మంత్రివర్గ విస్తరణ గురించి తనకు ఎలాంటి సమాచారం లేదని అంటూనే… ఇరిగేషన్ శాఖ అంటే జ్యోతుల నెహ్రూకు చాలా ఆసక్తి అని వెల్లడించడం ద్వారా చినరాజప్ప, తన సహచర మంత్రి దేవినేని ఉమా కు చెక్ పెట్టే ప్రయత్నం చేస్తున్నట్లుగా తెలుస్తున్నది. చెక్ సంగతి ఏమో గానీ.. ఈ డైలాగుల వలన దేవినేని ఉమాకు ఎంతో కొంత ఆందోళన పుట్టిస్తారన్న మాట నిజం. జ్యోతుల పార్టీలోకి రావడంతో పాటూ మంత్రివర్గంలోకి రావడం కూడా ఖరారే అయ్యేట్లయితే గనుక.. ఆయనకు ఏ శాఖ దక్కుతుంది అనే విషయంలో ఎవరి ఊహాగానాలు వారికి ఉంటాయి. అయితే ఆయనకు ఇరిగేషన్ అంటే ఆసక్తి ఎక్కువ అనే మాటను ప్రకటించడం ద్వారా… దేవినేని ఉమా శాఖను కూడా మార్చే అవకాశం ఉన్నదా అనే ఊహాగానాలకు స్వయంగా చినరాజప్ప తెరలేపారని కూడా అనుకోవాల్సి వస్తున్నది.
మొత్తానికి స్థూలంగా చూడబోతే చంద్రబాబునాయుడు కేబినెట్లోని మంత్రులు విస్తరణ నేపథ్యంలో ఒకరి వెనుక ఒకరు నెమ్మదిగా గోతులు తవ్వుకుంటున్న పరిస్థితులు ఉన్నాయని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.