పీఎం కేర్స్ ఫండ్‌తో ప్రభుత్వానికి సంబంధం లేదని కేంద్రం ఢిల్లీ హైకోర్టులో అఫిడవిట్ దాఖలు చేయడం కలకలం రేపుతోంది. అసలు పీఎం కేర్స్ రాజ్యాంగం, కేంద్ర, రాష్ట్ర చట్టాల ప్రకారం ఏర్పాటయినది కాదని.. స్పష్టం చేశారు. అది ఓ ప్రైవేటు చారిటబుల్ ట్రస్ట్ లాంటిదని చెప్పుకొచ్చారు. ఆ నిధఇకి ఇస్తున్న విరాళాలు ప్రభుత్వ ఖాతాలో చేరవని తేల్చేసింది. అంతా పారదర్శకంగా జరుగుతోందని చెబుతోంది. కానీ సమాచార హక్కు చట్టం కిందకు తెచ్చేందుకు మాత్రం సిద్దంగా లేరు. పీఎంకేర్స్పై దాఖలైన పిటిషన్ విషయంలో ఈ అఫిడవిట్‌ను ఢిల్లీ హైకోర్టులో కేంద్రం సమర్పించింది. ప్రభుత్వానిది కాకపోతే వెబ్సైట్ డొమైన్ పేరులో ” డాట్ గవ్ “, ప్రధానమంత్రి ఫోటో, కేంద్ర ప్రభుత్వ ముద్ర ఎందుకున్నాయని పిటిషనర్ ప్రశ్నించారు.
పీఎం కేర్స్ ఫండ్ మొదటి నుంచి వివాదాస్పదంగా ఉంది. “పీఎం కేర్స్ ఫండ్”. కరోనా టైంలో కార్పొరేట్లు సాధారణ ప్రజలు విరాళివ్వడానికి ఏర్పాటు చేసిన వేదిక. మోడీ ఇలా ప్రారంభించడం ఆలస్యం.. అలా కార్పొరేట్లు పెద్ద ఎత్తున విరాళాలు ప్రకటించారు. ఐదు రోజుల్లోనే మూడు వేల కోట్లు జమ అయ్యాయి. అయితే మొదట్లో వివరాలు చెప్పిన అధికారులు తర్వాత సైలెంటయ్యారు.ఇది అసలు ప్రభుత్వానిదా? లేక ప్రైవేటుదా? అనే చర్చ కూడా జరిగింది. వివరాలు చెప్పేందుకు కేంద్రం నిరాకరిస్తోంది. ఇది ప్రభుత్వ అధీనంలోనే ఉంది కానీ.. ప్రైవేటు విరాళాల ద్వారా వస్తున్నది కాబట్టి ఆర్టీఐ చట్టం కూడా వివరాలివ్వబోమని అధికారులు దరఖాస్తు చేసుకున్న వారికి చెబుతున్నారు.
వాస్తవానికి ప్రధానమంత్రి సహాయనిధి అనేది ఎప్పటి నుండో ఉంది. ఎవరైనా విరాళాలివ్వాలంటే దానికి ఇస్తారు. దానికి చట్టబద్ధత ఉంది. ఖర్చు పెట్టిన ప్రతీ రూపాయి లెక్క పార్లమెంట్‌కు సమర్పించాల్సి ఉంటుంది. దాన్ని పక్కన పెట్టేసి కేవలం కరోనాపై పోరాటం కోసమంటూ… పీఎంకేర్స్ ప్రారంభించారు. వచ్చిన విరాళాలు.. చేస్తున్న ఖర్చుపై పారదర్శకత లేకపోవడంతో.. అందరిలోనూ అందులో ఏదో జరుగుతోందన్న అనుమానాలు పెరగడానికి కారణం అవుతున్నాయి. ఎందుకు ఈ విరాళాలు.. పీఎంకేర్స్పై గోప్యత పాటిస్తున్నారో అర్థం కాని పరిస్థితి ఏర్పడింది.