తెలుగుదేశం పార్టీ విషయంలో భాజపా నెమ్మదిగా ఓ క్లారిటీ ఇచ్చేస్తోంది! అదేనండీ… పొత్తు విషయంలో! తెలంగాణలో స్వతంత్రంగా ముందుకు సాగుదామనీ, ఏ ఇతర పార్టీలతో పొత్తు ఉండబోదనే సంకేతాలు ఇస్తున్నారు ఆ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కె. లక్ష్మణ్. ఒంటరిగా ఎదుగు… ఒంటరిగా సాగు అనే నినాదంతో రాష్ట్రంలో ముందుకు సాగబోతున్నట్టు చెప్పారు. తెరాస అనేది ఒక నీటి బుడగ అనీ, మున్ముందు కనిపించదని కూడా జోస్యం చెప్పారు. తెరాసకు ప్రత్యామ్నాయం భాజపా మాత్రమేననీ, రాష్ట్రంలో ఒంటరిగా భాజపా పయనం ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. కేంద్రం అందిస్తున్న ఎన్నో పథకాలను రాష్ట్రం అమలు చేయడం లేదనీ, పెద్ద మొత్తంలో నిధులిస్తున్నా వాటి గురించి మాట్లాడటం లేదని విమర్శించారు. కేంద్రం స్కీములపై తెరాస సర్కారు శ్వేత పత్రం విడుదల చేయాలంటూ లక్ష్మణ్ డిమాండ్ చేశారు.
మొత్తానికి ఒక క్లారిటీ అయితే ఇచ్చేశారు.. వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశంతో కలిసి కొనసాగేది ఉండదని చెప్పేసినట్టే. అయితే, ఒంటరిగా ఎదుగు, ఒంటరిగా సాగు అనే ఈ నినాదం ఏపీకి కూడా వర్తిస్తుందా లేదా అనేదే ప్రశ్న. ఎందుకంటే, ఏపీలో కూడా టీడీపీ, భాజపాల మధ్య అంత అనుకూల పరిస్థితులేం కనబడటం లేదు. పైగా, అక్కడ కూడా భాజపా సొంతంగా ఎదగాలని ఉవ్విళ్లూరుతోంది. కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు రూపంలో చంద్రబాబుకు అభయ హస్తం ఉన్న మాట వాస్తవమే! భాజపా ఎదుగుదలను ఏపీ సీఎం అడ్డుకుంటున్నారని విమర్శలు వినిపిస్తున్నా, ప్రధాని మోడీతో సహా ఢిల్లీ పెద్దలెవ్వరూ కిమ్మనకుండా ఉన్నారంటే కారణం ఆ అభయమే. కానీ, పార్టీ అస్తిత్వం ముఖ్యమా.. ఈ అభయం ముఖ్యమా అనే ప్రశ్న మొదలైనప్పుడు వెంకయ్య మౌనం వహించాల్సిన పరిస్థితి వస్తుంది!
ఆంధ్రాలో కూడా బలమైన మూలాల కోసం భాజపా ప్రయత్నించడం మొదలుపెట్టింది. రాష్ట్రంలో బూత్ స్థాయి కమిటీలు పటిష్ఠం చేయాలనీ, పార్టీ ఎదుగుదలపై రాష్ట్ర నేతలు దృష్టిపెట్టాలని నాయకులకు జాతీయ అధ్యక్షుడు అమిత్ షా క్లాస్ తీసుకున్న సంగతి తెలిసిందే. సో.. ఏపీ విషయంలో కూడా భాజపా ఒక విజన్ తోనే ఉందని అనడంలో సందేహం లేదు. తెలంగాణలో టీడీపీతో తెగతెంపులు చేసుకున్నట్టు స్పష్టమైన సంకేతాలే ఇచ్చేస్తున్నారు. ఆంధ్రా విషయంలో మున్ముందు ఇలాంటి ధోరణే ఉంటుందని చెప్పకనే చెబుతున్నట్టు అర్థం చేసుకోవాలి.
ప్రాక్టికల్ గా చూసుకున్నా కూడా ఏపీలో టీడీపీతో భాజపా కలిసి కొనసాగలేని పరిస్థితి తప్పదేమో అనిపిస్తోంది. ఆంధ్రాలో భాజపాతో ఫ్రెండ్ షిప్, తెలంగాణలో భాజపాపై పోరాటం అనేది తెలుగుదేశం పార్టీకి సాధ్యం కావొచ్చు. ఎందుకంటే, ఇది ఈ రెండు రాష్ట్రాలకే పరిమితమైన పార్టీ కాబట్టి. కానీ, భాజపా జాతీయ పార్టీ. రెండు రాష్ట్రాల్లో ఉన్న టీడీపీతో రెండు విధాలుగా వ్యవహరించడం అనేది మున్ముందు వారికే ఇబ్బంది కలిగించే పరిణామం అవుతుంది. సో.. టీడీపీతో దశలవారిగా పొత్తు కటింగ్ కి భాజపా సిద్ధమౌతున్నట్టుగానే ఇప్పుడు చెప్పుకోవాలి.