శకునం చెప్పే బల్లి కుడితిలో పడినట్టు అన్న సామెత విన్నారా… అలా ఉంది ఈనాడు వ్యవహారం అంటూ భాషాభిమానులు మండి పడుతున్నారు.
ప్రస్తుతం తెలుగు భాషకు సంబంధించి మీడియా పోషిస్తున్న పాత్రపై భాషాభిమానుల్లో ఎక్కువ మంది నిరసన తెలియ జేస్తున్న విషయం తెలిసిందే. అయితే అదే సమయంలో… ఈనాడు మాత్రం భాషను కాపాడే క్రమంలో నానా పాట్లు పడుతోంది. తెలుగులోకి చొచ్చుకొచ్చేసిన అన్య భాషా పదాలను కష్టపడి తెలుగులోకి మార్చే సాహసాలు కూడా చేస్తోంది. ఈ క్రమంలో కొన్ని సార్లు అవహేళన కు కూడా గురవుతోంది. అయినప్పటికీ… వెనుకడుగు వేయడం లేదు.
తన వంతు తాను చేస్తూనే.. తెలుగు భాష పరిరక్షణకు సంబంధించి ప్రతి ఒక్కరూ కట్టుబడాలని నిత్యం చెబుతూ ఉంటుంది కూడా. భాష విషయం లో ఇంత మంచి ట్రాక్ రికార్డ్ ఉన్న ఈనాడు తొలిసారిగా తప్పులో కాలేసింది. అది కూడా ఏకంగా… తెలుగు తల్లిని అవమాన పరచింది అనే అపప్రధ మూట కట్టుకుంది.
దీనికి గురువారం ఈనాడు లో ప్రచురించిన కార్టూన్ కారణంగా మారింది. తెలుగు తల్లి కొలువుదీరిన ఇంటి గుమ్మానికి తెలంగాణ ముఖ్య మంత్రి కేసీఆర్ తోరణాలు కడుతున్నట్టు ఈ కార్టూన్ చెబుతుంది. తెలంగాణ రాష్ట్రంలో రాజధాని నగరంలో ప్రపంచ తెలుగు మహాసభలు జరుగుతున్న నేపథ్యంలో గీసిన ఈ కార్టూన్… నిజానికి భాషాభిమానుల తో పాటు కేసీఆర్ అభిమానులు కూడా సంబరపడేలా చేయాలి.
అయితే అదెంత వరకూ చేసిందో గాని… ఆ కార్టూన్ లో తెలుగు తల్లి ని చిత్రించిన తీరు ఇప్పుడు విమర్శల పాలవుతోంది. తెలుగు తల్లిని అర్ధ నగ్నంగా , వంపు సొంపులతో గీశారంటూ సోషల్ మీడియాలో దుమ్మెత్తి పోస్తున్నారు. చేయి తిరిగిన కార్టూనిస్ట్ శ్రీధర్ ను సినీ దర్శకుడు రాఘవేంద్రరావు పూనాడా అంటూ మరి కొందరు ఎద్దేవా చేస్తున్నారు. కాలం కలిసి రాకపోతే గీసిన బొమ్మే పరువు తీసిన కారణం అవుతుంది కదూ…