బొల్లినేని శ్రీనివాస గాంధీ అనే ఈడీ అధికారిని సీబీఐ అరెస్ట్ చేసింది. ఎందుకు చేసింది అంటే.. ఆయన తప్పుడు కోవిడ్ రిపోర్టులు సమర్పించారని.. విచారణకు సహకరించలేదని.. ఇలాంటి కారణాలతో అరెస్ట్ చేసింది. అంతకు ముందు ఆయనపై ఆదాయానికి మించి మూడున్నర కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నాయని సీబీఐ కేసు నమోదు చేసింది. ఆ కేసు విచారణలో సహకరించలేదని అరెస్ట్ చేసింది. అంతే.. ఆంధ్రప్రదేశ్ అధికార పార్టీకి అనుబంధంగా మారిపోయిన రెండు చానళ్లకు పూనకం వచ్చేసింది. ఆ శ్రీనివాసగాంధీకి వందల కోట్లు ఆస్తులు ఉన్నాయని.. కథనాలు రాసేసింది. ప్రచారం చేసేసింది. ఇష్టం వచ్చినట్లుగా ఆరోపణలు చేసేసింది. ఆయన ప్రభుత్వ సర్వీసులో ఉన్న ఉద్యోగి కాబట్టి… తాము ఎంత బురద చల్లినా నోరు తెరవలేడన్నట్లుగా ఆ మీడియా చానళ్లు ఇష్టం వచ్చినట్లుగా కథనాలు ప్రసారం చేశాయి.
ఆ ఈడీ అధికారిపై ఎందుకంత కసి అంటే… ఆయన జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసులో చురుకుగా వ్యవహరించిన అధికారి. ఆయన అత్యంత కఠినంగా ఉండటం వల్లే జగన్ అక్రమాస్తులకు సంబంధించి ఈడీ కేసులు ఇప్పుడు… బలంగా ఉన్నాయి. అప్పట్లో ఆస్తులను ఎటాచ్ చేశారు. కొన్నింటిని వైసీపీ గెలిచిన తర్వాతసీఎం జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత అటాచ్ నుంచి విడిపించుకున్నారు. ఇప్పుడు ఈడీ అలా విడిపించడం కరెక్ట్ కాదని.. మళ్లీ కోర్టుల్లో పిటిషన్లు వేస్తోంది. అప్పట్లో ఆ శ్రీనివాసగాంధీ తమను వెంటాడారన్న ఉద్దేశంతో ఇప్పుడు.. ఆయనపై కేసును సాకుగా చూపి. ఇష్టం వచ్చినట్లుగా వ్యక్తిత్వ హననానికి రెండు చానళ్లు పాల్పడుతున్నాయి.
ఈడీ అధికారిగా శ్రీనివాసగాంధీ హైప్రోఫైల్ కేసులను విచారించారు. ఆయన జగన్, గాలి జనార్ధన్ రెడ్డి తో పాటు బంగారు వ్యాపారుల అక్రమ లావాదేవీల్ని రట్టు చేశారు. ఆ తర్వాత జీఎస్టీ విభాగంలోకి వెళ్లారు. అక్కడ ఐదు కోట్ల రూపాయలలంచం డిమాండ్ చేశారని కేసు పెట్టారు. నిజానికి ఆయన లంచం తీసుకునే వ్యక్తి అయితే.. ఆయన దర్యాప్తు చేసిన హై ప్రోఫైల్ కేసుల్లో ఫేవర్‌గా ఉండి ఉంటే ఆయనకు ఎన్ని వందల కోట్లు వచ్చేవో… సులువుగానే అర్థం చేసుకోవచ్చన్న కోణంలో ఆ మీడియాలు విశ్లేషించలేదు. గాలి జనార్ధన్ రెడ్డి బెయిల్ కోసం కింది కోర్టు న్యాయమూర్తికి ఎన్ని కోట్లు ఇవ్వబోయారో రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడితేనే తెలిసిపోయింది. ఇక గాంధీ లాంటి వారికి ఆఫర్ చేయకుండా ఉంటారా..? ఇలాంటివి ఆ చానళ్లు చెబితే.. అక్రమార్కుల అంతు చూసే విధుల్లో ఉండేవారి కాస్తంత మనోధైర్యం వస్తుంది.
తమ రాజకీయ బాసుల కేసులను సీరియస్‌గా విచారించారని.. అధికారులపై ఇలాంటి నిందలేస్తే.. రేపు ఏ ఒక్క రాజకీయ నాయకుడి అక్రమాలపై విచారణ చేయడానికి అధికారులు సిద్ధపడరు. తృణానికో ..పణానికో అలవాటు పడిపోతారు. అది సమాజానికి.. ప్రజలకు మంచిది కాదు. కానీ మెరుగైన సమాజం కోసం తపించే మీడియాలకు … మెరుగైన సమాజం అంటే.. తమ యజమానులు.. వారికి ఆర్థిక ప్రయోజనాలు కల్పించే పాలకులు బాగుండటమే అనుకుంటున్నారు.