చిత్రసీమ కోసం ఏదైనా చేయాలన్న ఆలోచన ఈమధ్య చిరంజీవిలో ఎక్కువగా కనిపిస్తోంది. ఇది స్వాగతించాల్సిన విషయం. సీసీసీ పేరుతో కోవిడ్ సమయంలో సినీ కార్మికులకు నిత్యావసర వస్తువులు అందించారు చిరు. ఈ సేవాకార్యక్రమంలో మిగిలిన నటీనటుల చేయూత ఉంది. కాకపోతే.. చిరు వల్లే సీసీసీ గ్రాండ్ సక్సెస్ అయ్యిందన్నది నూటికి నూరుపాళ్లు నిజం. సీసీసీ అనే కాదు.. ఈమధ్య టాలీవుడ్ లో ఎవరికి ఏ ఆపద వచ్చినా ముందు చేయూత అందిస్తోంది చిరునే. ఇప్పుడు చిత్రపురి కాలనీలో తన తండ్రి పేరు మీద ఓ ఆసుపత్రి కట్టిస్తానని ప్రకటించారు. చిరు నుంచి ఈ ప్రకటన రాగానే.. సర్వత్రా హర్షం వ్యక్తమైంది. చిరు సేవా పథంలో ఇది మరో అడుగు అన్నారు. కాకపోతే.. చిత్రపురిలో ఆసుపత్రి కట్టే హక్కు, అర్హత చిరు కంటే.. ప్రభాకర్ రెడ్డి కుటుంబానికే ఎక్కువ ఉందన్నది మరో కీలకమైన వాదన. వాటి పూర్వాపరాలూ ఆసక్తికరమైనవే.
చిత్రపురి కాలనీ చరిత్రని తిరగేస్తే.. ఆ కాలనీ కోసం ఎక్కువ కష్టపడింది.. నటుడు ప్రభాకర్ రెడ్డి. అసలు సినీ కార్మికులకు ఓ సంఘం ఉండాలన్న ఆలోచన కూడా ఆయనదే. చిత్రపురి కాలనీ ఆనే ఆలోచనకు అంకురార్పణ చేసింది ప్రభాకర్ రెడ్డి. కాసు బ్రహ్మానంద రెడ్డి హయాంలో చిత్రపురి కాలనీ కోసం అరవై ఎకరాలు కేటాయించారు. అందులో పది ఎకరాలు ప్రభాకర్ రెడ్డి దానం చేసినవే. అందుకే ఈ కాలనీకి ప్రభాకర్ రెడ్డి పేరు పెట్టారు. ప్రభాకర్ రెడ్డి కుమార్తెలు ఈ కాలనీలో తండ్రి పేరు మీద ఓ ఆసుపత్రి కట్టించాలని ఎప్పటి నుంచో ప్రయత్నిస్తున్నారు. అందుకు రకరకాల అడ్డంకులు వస్తున్నాయి. అయినా.. వాళ్లు శ్రమిస్తూనే ఉన్నారు. ఇప్పుడు అక్కడ ఆసుపత్రి కట్టి.. ఆ క్రెడిట్ చిరు పట్టుకెళ్లిపోతున్నాడన్నది ప్రభాకర్ రెడ్డి కుటుంబ సభ్యుల ఆరోపణ. చిరు తలచుకుంటే ఆసుపత్రి కట్టించడం చాలా తేలికైన విషయం. వచ్చే యేడాదిలోగా బ్రహ్మాండమైన వసతులతో ఓ ఆసుపత్రి చిత్రపురిలో వెలుస్తుంది. అయితే… ప్రభాకర్ రెడ్డి వారసురాళ్లు మాత్రం `చిత్రపురి కోసం మా తండ్రిగారు పడిన కష్టాన్ని పూర్తిగా తొలగించడానికే… ఈ ప్రయత్నం` అంటూ కొత్త వాదన తీసుకొస్తున్నారు. చిత్రపురి కాలనీలో ఓ ఆసుపత్రి వస్తే.. వందల కుటుంబాలకు చేయూతగా ఉంటుంది. అది ఎవరు కడితే ఏమిటి? అనేది మరో వాదన. రెండింటిలోనూ పాయింట్ ఉంది.
చిత్రపురిని ఆనుకొని మరో పది ఎకరాల ప్రభుత్వ స్థలం ఖాళీగా పడి ఉంది. దాన్ని చిత్రపురిలో కలిపేయాలని ఎప్పటి నుంచో.. ప్రయత్నాలు జరుగుతున్నాయి. కానీ ప్రభుత్వం సానుకూలంగా స్పందించడం లేదు. ఆ పది ఎకరాలూ కలిపేస్తే చిత్రపురిలో మరిన్ని సౌకర్యాలు వెలుస్తాయి. ఇప్పుడు చిరు ఆసుపత్రి కట్టాలనుకొన్నా.. ఆ స్థలంలోనే నిర్మాణం జరగాలి. లేదంటే.. అక్కడ విల్లాల్లో ఓ విల్లా తీసుకొని, ఆసుపత్రిని సెటప్ చేయాలి. చిరులాంటి వ్యక్తి పూనుకొంటే.. ఆ పక్కనున్న ఖాళీ స్థలం చిత్రపురి సొంతం అవ్వడం ఖాయం. అక్కడే చిరు ఆసుపత్రి కట్టాలనుకుంటే అది ప్లస్సే అవుతుంది. ప్రభాకర్ రెడ్డి కుటుంబ సభ్యులు ఎప్పటి నుంచో ఆసుపత్రి కట్టాలకుంటున్న మాట నిజం. అయితే.. అది కార్యరూపం దాల్చడం లేదు. అలాంటప్పుడు చిరు ప్రయత్నాన్ని తప్పుబట్టడంలో అర్థం లేదు.
చిత్రపురి నిండా అనేక రాజకీయాలు నడుస్తున్నాయి. ఈ ఫ్లాటులు సినీ కార్మికుల కోసమే అయినా.. అసలు సినిమాలతో సంబంధం లేనివాళ్లు ఈ ఫ్లాట్స్ లో నివసిస్తున్నారన్నది నిర్వివాద అంశం. అందుకే చిత్రపురిని ప్రభుత్వం సైతం పట్టించుకోవడం లేదు. ముందు అక్కడి వ్యవస్థని చిరు లాంటి వ్యక్తులు ప్రక్షాళన చేయాలి. ఏ ఉద్దేశంతో చిత్రపురి వెలసిందో.. ఆ ఉద్దేశ్యానికి న్యాయం చేయాలి. ప్రభాకర్ రెడ్డి లాంటి వ్యక్తుల త్యాగాల్ని గుర్తించాలి. ఇది వరకు కూడా చాలామంది చిత్రపురిలో ఆసుపత్రి కట్టిస్తామని ప్రకటనలు చేశారు. అందులో రాజశేఖర్ లాంటి హీరోలూ ఉన్నారు. వాళ్ల మాట.. కేవలం ప్రకటనల వరకే పరిమితం. దాసరి, మోహన్ బాబు లాంటి వాళ్లు చిత్రపురిలో టవర్లు తమ సొంత ఖర్చుతో నిర్మిస్తామని అప్పట్లో మాట ఇచ్చిన వాళ్లే. అవీ గాలిమాటలే అయిపోయాయి. ఇప్పుడు చిరు ఆసుపత్రి కట్టిస్తానంటున్నారు. చిరు ఓసారి మాట ఇస్తే తప్పే వ్యక్తి కాదు. సో.. ఈ రకంగానైనా చిత్రపురిలో ఆసుపత్రి వెలిస్తే.. అంతకంటే కావాల్సిందేముంది? కాకపోతే.. ఆ ఆసుపత్రికి తన తండ్రి పేరు కాకుండా.. చిత్రపురి కోసం విశేషంగా శ్రమించి, విలువైన తన పది ఎకరాల భూమినీ ధారాదత్తం చేసిన ప్రభాకర్ రెడ్డి లాంటి వాళ్ల పేరు పెడితే సముచితంగా ఉంటుంది.