ఆంధ్రప్రదేశ్‌లో వైరస్ టెస్ట్ కిట్ల కొనుగోలులో భారీగా అవినీతి జరిగిందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. సాక్ష్యాలతో సహా అవి సోషల్ మీడియాలో వైరల్ కావడంతో.. ప్రభుత్వం హుటాహుటిన స్పందిచింది. వైరస్ సమాచారం కోసం ప్రత్యేకంగా కేటాయించిన ట్విట్టర్ హ్యాండిల్లో వివరణ స్టేట్మెంట్లు… బెదిరిపులు పెట్టడానికి ప్రాధాన్యం ఇచ్చింది. ఇంత చేసినా.. తాము ఉజ్జాయింపుగా కొన్న లెక్క చెబుతున్నారు కానీ… కరెక్ట్‌గా ఎంతకు కొన్నారు..? ఎన్ని ఆర్డర్లు ఇచ్చారు..? లాంటి ఉత్తర్వులను మాత్రం బయట పెట్టడం లేదు.
మూడు రోజుల క్రితం దక్షిణకొరియా నుంచి ఏపీకి లక్ష కరోనా ర్యాపిడ్ టెస్ట్ కిట్లు వచ్చాయి. వచ్చిన వెంటనే ముఖ్యమంత్రి వాటిని ఓపెన్ చేశారు. తాను ఓ ర్యాపిడ్ టెస్ట్ చేయించుకున్నారు. దేశంలో ఇలా లక్ష కిట్లు తెప్పించుకున్న రాష్ట్రం లేదని.. వైరస్ పై పోరాటంలో.. జగన్ చిత్తశుద్ధికి ఇది నిదర్శమని.. దేశం మొత్తం రాష్ట్రం వైపు చూస్తోందని.. వైసీపీ నేతలు ప్రకటించుకున్నారు. అయితే…ఇరవై నాలుగు గంటలు గడవక ముందే.. సోషల్ మీడియాలో ఆరోపణలు ప్రారంభమయ్యాయి. చత్తీస్ గఢ్ మంత్రి చేసిన ఓ ట్వీట్ దీనికి కారణం అయింది. తాము రూ. 337 రూపాయలకే ఒక్క కిట్ చొప్పున 75వేల కిట్లు కొనుగోలు చేశామని.. అది తమ గొప్పదనమని అయన ట్వీట్ చేశారు. అయితే.. ఏపీలో రూ. 1200కి కొన్నారని.. పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని సోషల్ మీడియాలో ప్రచారం ప్రారంభమయింది.
దీనిపై ఉలిక్కిపడిన ప్రభుత్వం.. అవన్నీ అసత్య ఆరోపణలు అని… చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ప్రకటించింది. ఒక్కో టెస్ట్ కిట్.. రూ. ఏడు వందలకు అటూ ఇటూగా కొనుగోలు చేశామని… చెప్పుకొచ్చింది. ఇది కూడా.. చాలా పెద్ద మొత్తమే. దాదాపుగా డబుల్. చత్తీస్ గడ్ ఎస్డీ బయోసెన్సార్ అనే కొరియా కంపెనీ నుంచి కొనుగోలు చేసింది. ఏపీ కూడా అదే కంపెనీ నుంచి కొనుగోలు చేసింది. దీంతో కొనుగోలు వ్యవహారంలో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందనే అనుమానాలు బలపడుతున్నాయి. కవర్ చేసుకోలేని విధంగా పరిస్థితులు మారడంతో… టెస్ట్ కిట్ల కొనుగోలుపై… చత్తీస్ ఘడ్తో పాటు ఇతర రాష్ట్రాలతో మాట్లాడుతున్నామని.. త్వరలోనే దీనిపై ప్రకటన చేస్తామని మరో ట్వీట్ చేశారు. ఇంత చేసినా… అసలు కొనుగోలు ఆర్డర్ పత్రం మాత్రం బయట పెట్టలేదు.