విజయవాడ నుంచి నవ్యాంధ్ర తొలి శాటిలైట్ టీవీ ట్యాగ్‌తో ప్రసారమవుతున్న ఎపి24/7 ఛానల్ స్థానికంగా ఈవెంట్లు నిర్వహిస్తున్నది. కొంత కదలికతో పాటు అక్కడి వారిలో ఉత్సాహం కూడా వచ్చింది. అంతవరకూ బాగానే వుంది గాని అక్కడకు వెళ్లని వారిది తప్పన్నట్టు చిత్రించేందుకు కొంతమంది రాజకీయ వాదులు ముఖ్యంగా టీడీపీ అనుయాయులు ప్రయత్నించడం బాలేదు. రిపబ్లిక్ డే నాడు చేసిన జెండా పండుగలో జర్నలిస్టు సాయి తొలి పలుకులు చెబుతూ అక్కడ కూచుని సొల్లు చర్చలు చేయడం కాదు, ఇక్కడకు వచ్చి సొల్యూషన్స్ చూపించాలని ఓ సవాలు విసిరారు. ఈ ఎపి వర్సెస్ టిఎస్ విజయవాడ వర్సెస్ తెలంగాణ ధీమ్నే పట్టుకున్న ఒక టిడిపి నాయకుడు వెంటనే అదిగో సాయి గర్జిస్తున్నాడంటూ పోస్టు పెట్టారు. యూ ట్యూబ్‌లో కూడా సొల్లు చర్చలు కాదు అని శీర్షిక నిచ్చారు. తమను తాము ఎంతైనా పొగుడుకోవచ్చు ముందుగా వెళ్లడాన్ని హర్షించవచ్చు గాని మిగతా వారిపై వ్యాఖ్యలు ఎందుకని అడిగితే నిర్వాహకులు ఇచ్చిన సమాధానం మరోలా వుంది. తాము కత్తి మహేష్, రామ్ గోపాల్ వర్మ ల చెత్తచర్చల గురించి అన్నామే గాని ఇతర అంశాలు కాదని వారు వెంటనే వివరణిచ్చారు. సొల్లు అన్నందుకు వెంటనే సర్దుకునే ప్రయత్నం కూడా చేశామని చెబుతున్నారు. టిడిపి ఆ మాటలకు ఇచ్చిన ట్విస్టు కూడా వారికి రుచించడం లేదు.
ఇంతకూ ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిన చాలా కాలానికి గాని పత్రికలు మద్రాసు నుంచి విజయవాడ రాలేదు. అప్పుడూ ఇప్పుడూ కూడా ముందుగా వెళ్లింది ప్రజాశక్తి మాత్రమే! హైదరాబాదుకూ ఆలస్యంగాే ఈనాడు గాక ఇతర పత్రికలు తరలివచ్చాయి. సినిమా పరిశ్రమ 90లలోనే తరలింది. కనుక ప్రతిదానికి సాధకబాదకాలుంటాయి.పైగా రెండూ తెలుగు రాష్ట్రాలే గనక హైదరాబాదులో అందరికీ వ్యాపారులున్నాయి గనక పెద్ద హడావుడి కూడా పడటం లేదు. కొత్తవారుఅక్కడే పెట్టడం వేరు. వారు నిలదొక్కుకోవాలని కోరుకోవాలి, కాని మీడియా వ్యాపారంలో ప్రత్యక్ష లాభాలు తక్కువ గనక కోటానుకోట్లు పెట్టి పరుగెత్తాలనుకోవడం సులభ సాధ్యం కాదు. సమయం పడుతుంది,సహనం కోరుతుంది. సినీ అవార్డుల సందర్భంలో ఆధార్ కార్డు గురించి యువరాజు లోకేశ్ మాట్లాడితే ఎంత వివాదమైందో ఎవరూ మర్చిపోకూడదు. ఇంతా చేసి లోకేశ్ భార్యాపిల్లలు భారీ నివాస భవనం హైదరాబాదులోనే వున్న మాట నిజం కదా! సొల్యూషన్ దొరికే వరకూ సొల్లు మాట్లాడకపోవడమే మంచిది.