తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సమీప బంధువులు ప్రవీణ్ రావు సోదరుల కిడ్నాప్ వ్యవహారం తెలుగు రాష్ట్రాల్లో సంచలనాత్మకం అయింది. రెండు వైపులా స్పందనలు చూసిన తర్వాత అదో భూవివాదం అని…అదీ కూడా చిన్న మొత్తం కాదన్న విషయం స్పష్టమయింది. హైదరాబాద్‌లో అత్యంత విలువైన ప్రాంతం అయిన హాఫీజ్ పేటలో దాదాపుగా పాతిక ఎకరాలకు చెందిన వివాదం. ఆ భూమి విలువ వెయ్యి కోట్ల పైమాటే. దాన్ని రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్‌గా మారిస్తే.. రూ. రెండు మూడు వేల కోట్లవుతుంది. అంత ఖరీదైన ప్రాపర్టీ కోసమే ఇప్పుడు కిడ్నాపులు జరుగుతున్నాయి. అది ముదిరితే మర్డర్లూ జరుగుతాయి. ఇంతా చేసి.. ఆ ఆస్తంతా… ఇప్పుడు వివాదాల్లో ఉన్న వారి పేరన ఉందా అనేదే ఇప్పుడు అందరికీ వస్తున్న అసలు సందేహం.
భూమా నాగిరెడ్డి ఏ పార్టీలో ఉన్నా… ఆయన ఆళ్లగడ్డ నేపధ్యం.. ఫ్యాక్షన్ లీడర్ ఇమేజ్ కలిపి… సెటిల్మెంట్ కింగ్‌గా మార్చాయి. ఆ సెటిల్మెంట్లలో కీలకంగా వ్యవహరించేది ఆయన కుడిభజం ఏవీ సుబ్బారెడ్డి. సెటిల్మెంట్లు, రియల్ ఎస్టేట్ వ్యవహారాలు.. వ్యాపారాలు మొత్తం ఆయన చేతుల మీదుగానే నడిచేవి. అలా నిర్వహించిన వాటిలో చేతికి అందిన భూమి హాఫీజ్ పేట భూమి. కానీ అది భూమా పేరు మీద లేదు. బినామీల పేరు మీదనే ఉంది. ఆయన హఠాత్తుగా చనిపోవడంతోనే అసలు సమస్య వచ్చింది. ఓ వైపు ఏవీ సుబ్బారెడ్డి ఎదురు తిరగడం.. మరో వైపు… ఆ భూమి విషయంలో.. సీఎం కేసీఆర్ బంధువులు రంగంలోకి దిగడంతో పరిస్థితి మారిపోయింది. ప్రవీణ్ రావు వర్గీయులు కూడా… ఆ భూమి తమదేనని.. తమ పేరుపై ఉందని… తామే కొనుగోలు చేశామని స్పష్టంగా చెప్పడం లేదు. ఆ భూవివాదంలో భూమా కుటుంబంతో గొడవలు ఉన్నయని అంగీకరిస్తున్నారు.
బినామీలతో వ్యవహారాలు నడపడం రాజకీయ నేతలకు కామన్. వారి దగ్గరి అనుచరుల ద్వారా వ్యవహారాలు చక్క బెడతారు. ఎక్కువగా.. రాయలసీమ ఫ్యాక్షన్ లీడర్లు.. ఈ దందాకు ప్రాధాన్యం ఇస్తారు. బెదిరించి తక్కువకు కొనుగోలు చేయడం లేదా.. సెటిల్మెంట్ చేసి కొంత పోగేయడం వంటి వాటి ద్వారా వాటిని వెనకేసుకుంటారు. ఆ సెటిల్మెంట్ కింగ్ హవా ఉన్నంత వరకూ బాగానే ఉంటుంది. కానీ… ఆ తర్వాత పరిస్థితి మారిపోతుంది. వేరే వారికి అధికారం చిక్కిన తర్వాత వారు మాత్రం ఎందుకు ఊరుకుంటారు. అలాంటి భూముల్ని నయానో.. భయానో సొంతం చేసుకోవాలనుకుంటారు. ఇప్పుడు.. హాఫిజ్ పేట భూముల పరిస్థితి అదేనని స్పష్టంగా తెలుస్తోంది.
ఇక్కడ భూమా వర్గం.. చేసింది కిడ్నాపే. వారు దొరికిపోయారని కూడా అనుకోవడానికి లేదు. ఎంత సీఎం కేసీఆర్ బంధువులకైనా ప్రాణం భయం ఉంటుంది. కిడ్నాప్ అయిన వారు.. తమకు రక్షణ ఉంటుందని ఇక ముందు ఎలా అనుకోగలరు. ఏదో విధంగా సెటిల్మెంట్ చేసుకునేందుకు ప్రయత్నిస్తారు. నిన్న వారి వైపు వ్యక్తులు చూపించిన స్పందన అదే. వివాదాన్ని పరిష్కరించుకుంటామన్నట్లుగా మాట్లాడారు. తర్వాత వారికి వారు రాజీ పడవచ్చు. కానీ.. వివాదం అంతటితో సమసిపోదు. ఈ సారి వేరే గ్రూపుల మధ్య ఈ గొడవలు రావొచ్చు.
అసలు వివాదాలన్నీ.. రాజకీయ నేతల బినామీ వ్యవహారాల వల్లే వస్తున్నాయి. ఆ బినామీల గుట్టు తేల్చాలని అధికారంలో ఉన్న వారు అనుకోరు. ఎందుకంటే.. వారికి నల్లమచ్చలుంటాయి. అవి అన్ని పార్టీల నేతలతో పెన వేసుకుపోయి ఉంటాయి. ఒకరి గుట్టు తేల్చాలనుకుంటే.. అందరివీ బయటకు వస్తాయి. అందుకే.. ఎవరూ ఎవరి జోలికిపోరు. ఈ వివాదం కూడా… రేపో మాపో పెట్టీకేసుగా మారిపోతుంది. రచ్చ అయింది కాబట్టి… ఒకరు ఎక్కువో.. తక్కువో తీసుకుని సెటిల్ చేసుకుంటారు. కానీ ఈ దందా మాత్రం.. ఎప్పటికీ ఆగదు.