`మా బిల్డింగ్` వ్యవహారం ఎట్టకేలకు ఓ కొలిక్కి వచ్చింది. `బిల్డింగ్ నేను కట్టిస్తా.. ఇక ఈ టాపిక్ ఆపేయండి` అని విష్ణు డిక్లేర్ చేసేశాడు. ఎన్నేళ్ల నుంచో నలుగుతున్న టాపిక్ ఇది. విష్ణు ప్రకటనతో.. దీనికి పుల్ స్టాప్ పడాలి. కానీ ఈ వ్యవహారం కనిపించినంత ఈజీ కాదు. ఇప్పటి నుంచే అసలైన `గేమ్` మొదలయ్యే ఛాన్సుంది.
మా బిల్డింగ్ కట్టాలంటే దాదాపు 2 కోట్ల వరకూ ఖర్చవుతుందని ఓ అంచనా. స్థలం గవర్నమెంట్ ఇస్తే.. బిల్డింగ్ వ్యవహారం `మా` చూసుకోవాలి. ఇదీ… ఎప్పటి నుంచో అనుకుంటున్న సంగతి. ఇప్పుడు `మా`కి కావల్సింది… బిల్డింగ్ కట్టే దాతలు కాదు. స్థలం. ఫిల్మ్‌నగర్ ఏరియాలో `మా` బిల్డింగ్ కావాలని ఎప్పటి నుంచో ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపుతున్నారు. ఫిల్మ్ నగర్లో స్థలం అంటే మాటలు కాదు. కోట్లతో వ్యవహారం. ప్రస్తుతం ఉన్న మార్కెట్ రేట్లని బట్టి చూస్తే.. స్థలానికే 100 కోట్ల ఖర్చవుతుంది. కాబట్టే.. ప్రభుత్వం మీన మేషాలు లెక్కేస్తోంది. ప్రభుత్వం స్థలం ఇచ్చేస్తే.. బిల్డింగ్ కట్టడం పెద్ద మేటరేం కాదు. ఎందుకంటే.. ప్రకృతి వైపరీత్యాలు, కరోనా లాంటి కాలంలోనే కోటాను కోట్లు.. ప్రభుత్వాలకు విరాళాలుగా ప్రకటించారు. అలాంటి హీరోలున్న `మా`కి 2 కోట్లతో బిల్డింగ్ కట్టడం పెద్ద విశేషం కాదు. అందులో పాతిక శాతం నేనిస్తా.. అని విష్ణు ఎప్పుడో ప్రకటించాడు. ఇప్పుడు పూర్తి ఖర్చు నాదే అంటున్నాడు. అదే తేడా.
విష్ణు ఒక్కడే `మా` బిల్డింగ్ కట్టేస్తే… ఆ క్రెడిట్ అంతా.. మంచు ఫ్యామిలీకి దక్కుతుంది. తరతరాలుగా నిలిచిపోయే భవనానికి ఆ క్రెడిట్ ఒక్కరికే ఇచ్చేస్తే ఎలా? ఇదే క్వశ్చన్ ఇప్పుడు అగ్ర హీరోల్ని వెంటాడొచ్చు. అసలే మన హీరోల చుట్టూ కనిపించని ఈగోలు, కాంపౌండ్ వ్యవహారాలూ చాలానే ఉంటాయి. కాబట్టి.. విష్ణు కడతానన్నా.. `మేమంతా లేమూ.. అందరం కలిసి కట్టేద్దాం` అనేవాళ్లే ఎక్కువ. కావాలంటే చూడండి. `మా బిల్డింగ్ నేనే కడతా` అని విష్ణు చెప్పి రెండు రోజులైనా.. `మా` నుంచి ఒక్కరూ స్పందించలేదు. మంచి నిర్ణయం తీసుకున్నావ్… శభాష్ అనలేదు. దానికి కారణం.. ఒక్కటే. ఈ క్రెడిట్ ఒక్కరికే ఇవ్వడం ఎవ్వరికీ ఇష్టం లేదు. నిజానికి `మా బిల్డింగ్` కాదు అసలు మేటరు. స్థలం కావాలి. ఆ స్థలం ప్రభుత్వమే ఇవ్వాలి. ఇండ్రస్ట్రీలో ఇంతమంది హీరోలుఉన్నారు. వాళ్లలో చాలామందికి ఫిల్మ్‌నగర్ లో స్థలాలున్నాయి. `నా స్థలంలో బిల్డింగ్ కట్టుకోండి` అని ఒక్క హీరో కూడా అనలేదు. కనీసం… అలాంటి ప్రతిపాదన ఏదీ రాలేదు కూడా. `మా` బిల్డింగ్ కట్టే విషయంలోనే ఆచి తూచి ఆలోచిస్తున్న హీరోలు.. అంత ఖరీదైన స్థలాన్ని ఇస్తారనుకోవడం అత్యాసే. కనీసం విష్ఱు నిర్ణయానికి సైతం అభినందనలూ, ప్రోత్సాహాలు లేవు. ఇదీ మన `మా` పరిస్థితి.