కాంగ్రెస్లోకి వచ్చాక టిఆర్ఎస్ ప్రభుత్వంపై తలపడటానికి సరైన సమస్య కోసం వెతుకుతున్న రేవంత్ రెడ్డికి విద్యుత్ వివాదం కలసి వచ్చింది. 24 గంటల విద్యుత్ సరఫరా ఘన విజయంగా కెసిఆర్ ప్రభుత్వం చెబుతుంటే అది నష్టదాయకమే గాక అవినీతిమయమని రేవంత్ విమర్శలు సంధిస్తున్నారు. ఇతర కాంగ్రెస్ నాయకులు ప్రతిపక్షాలు మాత్రమే గాక విద్యుత్జెఎసి నాయకులు రఘు వంటివారు కూడా ప్రస్తుత విద్యుత్ ఒప్పందాలను విధానాలను తప్పు పడుతున్నారు. మార్కెట్లో విద్యుత్ గిరాకి తగ్గి తక్కువకు తీసుకోవలసింది పోయి పాత పిపిఎల పేరిట అధిక ధరకు టి సర్కారు విద్యుత్ తీసుకుంటుందనేది ప్రధాన విమర్శ. ఆంధ్రజ్యోతి ఆర్కే కూడా ఈ విషయం సూటిగానే ప్రస్తావించారు. సహజశైలిలో రేవంత్ మరిన్ని వివరాలు తీశారు. వాస్తవాలపై చర్చకు రావాలని సవాళ్లు విసురుకున్నారు గాని అలాటివి జరిగేవి కావని అందరికీ తెలుసు. చివరకు రేవంత్పైకి ఎంపి బాల్కసుమన్ను ప్రయోగించి ప్రతి రోజూ ఎదురుదాడి చేయిస్తున్నారు. కాంగ్రెస్ ఎంపి సుబ్బరామిరెడ్డి దగ్గరకూడా విద్యుత్ కొంటున్నాము గనక ఆయన ముడుపులు ఇచ్చాడేమో చెప్పించాలని కూడా సుమన్ అన్నారు. నిజానికి ధరలు పడిపోవడం పాత ఒప్పందాల పేరిట అధిక ధరకు కొనడం, అవసరాన్ని మించి సరఫరా చేయడం అన్నీ నిజాలే. భూ గర్భ జలాలే లేనప్పుడు 24 గంటల విద్యుత్ ఏం చేసుకోవాలనే ప్రశ్న కూడా వచ్చింది. అయితే కెసిఆర్ అది తన ఎన్నికల వాగ్డానం కింద తీసుకున్నారు. సాంకేతిక సానుకూలత ఉపయోగించి ప్రారంభించారు. దీనిపై ఎంత వాదోపవాదాలు జరిగినా సరఫరా అంటూఅవుతుంది గనక పెద్ద ప్రభావం వుండకపోవచ్చు.