లక్ష్మీస్ NTR పేరు తో వర్మ తీయనున్న NTR బయోపిక్ ప్రారంభం కాకముందే సంచలనాలు సృష్టిస్తోంది. అయినా ఇలాంటి కాంట్రవర్సీలు వర్మకి కొత్తేమీ కాదు. అయితే ఈ విషయం లో మంత్రి సోమిరెడ్డి కి వర్మ కి మధ్య మీడియా సోషల్ మీడియా సాక్షిగా ఆసక్తికర వాగ్యుద్దం జరుగుతోంది.
మొదట సోమిరెడ్డి “వర్మ అంటేనే వివాదాలకి కేరాఫ్. పనీ పాటా లేని వ్యక్తి. ఆయన తీయబోయే బయోపిక్ లో త్యాగశీలి అయిన లక్ష్మీ పార్వతినే హీరోయిన్ గా పెట్టుకోవాలి” అని ఆయన సెటైర్ వేసారు. దీనికి వర్మ స్పందిస్తూ, ” అయితే లక్ష్మీ పార్వతి పక్కన మీరు హీరో గా నటించండి మరి” అని రిప్లై ఇచ్చారు. దీనికి మళ్ళీ సోమిరెడ్డి స్పందిస్తూ, ” నాకు హీరో గా చేయడానికి అభ్యంతరం ఏమీ లేదు. కానీ నాకు లక్ష్మీపార్వతి మీద ఎంతో గౌరవముంది కాబట్టి ఆవిడ పక్కన హీరో గా నటించలేను. మీరు హీరోయిన్ ని మారిస్తే నేను హీరో గా చేయడానికి రెడీ” అని మాటల తూటాలు విసిరారు.
దీని మీద ఇక వర్మ చెలరేగిపోయారు – “మీరు హీరోయిన్ ని మార్చమని అడిగిన తర్వాత, కత్రినా కైఫ్ నుంచి మా ఇంటి పని మనిషి దాకా చాలా మందిని మీ ప్రక్కన హీరోయిన్ గా నటించమని అడిగాను. దానికి వాళ్ళిచ్చిన సమాధానం వింటే మీరు ఉరేసుకుంటారు” – ఇదీ వర్మ సమాధానం. అలాగే సోమిరెడ్డి – “వర్మ వైసిపి నేత ని నిర్మాతగా పెట్టుకున్నాడు కాబట్టి ఈ సినిమా రాజకీయ ప్రయోజనాల కోసమే” అని వ్యాఖ్యానించగా, “వావ్, మీ బుర్ర కి హేట్సాఫ్” అని వ్యంగ వ్యాఖ్యలు చేసారు వర్మ. ఇంకా పోస్ట్ ల మీద పోస్ట్ లతో సోమిరెడ్డి మీద చెలరేగిపోయారు వర్మ.
అయినా వర్మ నోట్లో నోరు పెట్టడం కంటే బుద్ది తక్కువ పని ఉండదని సోమిరెడ్డి భావిస్తాడో ఏమో, ఈ ఎపిసోడ్ తర్వాత!