పెద్ద పెద్ద సినిమాలకు `కాపీ` బెడదలు తప్పడం లేదు. రిలీజ్ కి ముందో, తరవాతో… షూటింగ్ దశలో ఉన్నప్పుడో ‘ఈ కథ నాదే’ అంటూ ఎవరో ఒకరు అడ్డుతగలడం షరా మామూలైంది. ఈసారీ `పుష్స` విషయంలో ఈ మరక కాస్త ముందుగానే పడిపోయింది. అల్లు అర్జున్ – సుకుమార్ కాంబినేషన్ లో రూపుదిద్దుకుంటున్న సినిమా ‘పుష్ఫ’. ఈ సినిమా కథ నాదే.. అంటూ ఓ రచయిత ఇప్పుడు గళం విప్పుతున్నారు. ఆయన సాదాసీదా రచయితో, అనామకుడో కాదు. కేంద్ర సాహిత్య యువ పురస్కారాన్ని అందుకున్న రచయిత.. వేంపల్లి గంగాధర్.
2008లో తాను రాసిన ‘తమిళ కూలీ’ కథనే ‘పుష్ష’గా తీస్తున్నారని ఆయన ఆరోపిస్తున్నారు. ఇది కూడా ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో సాగే కథే. అటవీ నేపథ్యంలో సాగుతుంది. ఆ కథనే అటూ ఇటూ మార్చి `పుష్ష`గా తీస్తున్నారన్నది ఆయన ఆరోపణ. ఇది వరకు `అరవింద సమేత`పై ఇలాంటి ఆరోపణలు చేశారు. తాను రాసిన ‘మొండి కత్తి’ కథలో 5 రూపాయల ఫ్యాక్షన్ నేపథ్యాన్ని రాశారు. దాన్నే… `అరవింద సమేత`లోనూ చూపించారు. అప్పుడు ఈ రచయిత గళం విప్పినా, సినిమా విడుదలై, బయటకువచ్చేసింది కాబట్టి.. ఏం చేయలేకపోయారు. అందుకే.. ఇప్పుడు ముందుగానే పోరాటానికి సిద్ధమయ్యారీయన. మరి.. దీనికి సుకుమార్ అండ్ టీమ్ ఏ సమాధానం చెబుతుందో చూడాలి.