మన తెలుగు దర్శకుల్లో చాలా మందికి భావ దారిద్ర్యం వుంది. సరైన పాయింట్ ఎక్కడ వుంటే అక్కడి నుంచి కొట్టేయడం.దానికి అటు ఇటు కాస్త అతుకులు వేసి కొత్త కథగా మార్చడం. కొత్త రచయితలు ఎవరైనా తమ వద్దకు వచ్చి పాయింట్ చెబితే, విన్నట్లే విని, ఆ తరువాత కొట్టేయడం అన్నది చాలా మంది తెలుగు దర్శకులకు వున్న జబ్బు.
ఈ కాపీ వ్యవహారం అన్నది ఒక రకంగా జరగదు. అనేకానేక రకాలు.
విదేశీ సినిమాలు చూసి, కథ కొట్టేయడం
విదేశీ సినిమాలు చూసి సీన్లు కొట్టేయడం
పరభాషా సినిమాల్లోని పాటల చిత్రీకరణ చూసి కొట్టేయడం
ఎవరైనా ఔత్సాహికులు వచ్చి కథ చెబితే, బానే వుంది అని చెప్పి పంపించి, దాంట్లోని పాయింట్ కొట్టేయడం.
ఏమైనా అంటే ఇన్ స్పయిర్ అయ్యాం అని కవరింగ్ ఒకటి. రాజమౌళి దగ్గర నుంచి త్రివిక్రమ్ మీదుగా వక్కంతం వంశీ వరకు ఎవరూ అతీతులు కారు. మీడియాలో నానా యాగీ అయితే చివరి నిమిషంలో యుద్దనపూడి సులోచనారాణి నవల మీనా ను మళ్లీ అ..ఆ గా మార్చినందుకు టైటిల్ కార్డు వేసారు. విజయనిర్మల కు రాయల్టీ కట్టారు. అజ్ఞాతవాసి విషయంలో ఎంత గడబిడ అయిందో తెలిసిందే. జులాయి కి విదేశీ సినిమాల సీన్లు ఎలా వాడేసుకున్నారో గుర్తున్నదే.
జెంటిల్ మన్ సినిమాకు వేరే అతుకులు వేసి ఓ కథగా వండేసిన వైనం, వజ్రం సినిమాను మళ్లీ అటు ఇటు మార్చి ఇంకో సినిమాగా మార్చిన సంగతి. ఇలా రాసుకుంటూ పోతే తెలుగు సినిమా డైరక్టర్ల భావ దారిద్ర్యం బయటపడుతుంది.
రాజమౌళి సినిమాల్లో సీన్లు అన్నీ హాలీవుడ్ సినిమాల సీన్లను పక్కన పెట్టి చేసిన విడియోలు యూ ట్యూబ్ లో కో కొల్లలు. కాపీ రైట్ చట్టాల లోసుగులు ఆధారం చేసుకుని దర్శకులు చెలరేగి కాపీలు కొడుతున్నారు. శ్రీమంతుడు సినిమా మీద ఓ రచయిత ఫైట్ చేసిన సంగతి తెలిసిందే. వంశీ ‘ఔను వాళ్లిద్దరూ ఇష్టపడ్డారు’ మీద ఓ రచయిత కోర్టులో చిరకాలం పోరాటం చేసారు.
సినిమా జనాలకు వున్న అర్థబలం, లాయర్ల అండ సాదా సీదా రచయితలకు వుండదు. అందువల్ల వాళ్లు పోరాటం సాగించలేరు. రచయితల సంఘం కూడా నిర్మాతలకు, పెద్ద దర్శకులకు కొమ్ము కాస్తుందని ఆరోపణలు వున్నాయి. మిస్టర్ పెర్ ఫెక్ట్ విషయంలో రచయితల సంఘం ఇచ్చిన ప్రూఫ్ ల విషయంలో విమర్శలు వున్నాయి.
ఇండస్ట్రీలో ఓ మిడిల్ రేంజ్ దర్శకుడి దగ్గరకు కొత్తవాళ్లు వెళ్లి కథ చెబితే ఇక అంతే సంగతులు అన్న టాక్ వుంది. ఆయన గతంలో తీసిన ఓ బ్లాక్ బస్టర్ ఒక కొత్త దర్శకుడి ఐడియా అని గుసగుసలు వున్నాయి.
మైనే ప్యార్ కియాను చటుక్కున గుట్టు చప్పుడు కాకుండా తెలుగులోకి మార్చేసారు. సాజన్ సినిమాను రివర్స్ చేసి తెలుగులో తీసేసారు. ఇలా రాసుకుంటూ పోతే ఎన్ని ఉదాహరణలో?
మిస్టర్ పెర్ ఫెక్ట్ సినిమా తన నవలకు కాపీ అని ఓ రచయిత్రి కోర్టుకు వెళ్లి చిరకాలం పోరాటం సాగించారు. ఇప్పుడు ఆఖరికి కోర్టు కాపీనే అని నిర్థారణ చేసింది. ఈ మేరకు చర్యలు తీసుకోమని పోలీసులను ఆదేశించింది. పోలీసులు కేసు రిజిస్టర్ చేయాలి. ఎఫ్ఐఆర్ కట్టాలి. కోర్టులో చార్జ్ షీట్ వేయాలి. ఆపైన కేసు నడవాలి. ఎప్పుడో తీర్పు. ఇదే సినిమా జనాలకు అలుసుగా మారింది.
ఇప్పుడు ఈ జడ్జ్ మెంట్ చూసి అయినా తెలుగు దర్శకులు భయపడిపోతారని, మారిపోతారని అనుకుంటే భ్రమే. కాపీ రైట్ చట్టాలు బలంగా వుండనంత కాలం తెలుగు సినిమా దర్శకులు ఇలా కాపీ యే రైటు అనే విధంగా చెలరేగుతూనే వుంటారు.